సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోగా.. తాజాగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతమై ఉండగా.. చల్లటి గాలులు వీస్తుండడంతో నగరవాసులకు ఊరట కలిగించినట్లయ్యింది. త్వరలోనే తెలంగాణలో వానలు పలుకరించనున్నాయి.
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
గురువారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 36-26 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment