సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో రాష్ట్రమంతా తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే పలు జిల్లాలు జల దిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. వరదలతో ముప్పు తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక చేసింది.
నిన్నటి తీవ్ర అల్ప పీడనం నేడు అల్పపీడనంగా బలహీనపడినట్లు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది.
ఈ ప్రభావంతో తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రలోని 8 జిల్లాలకు ఆరెంజ్, 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
చదవండి: వరద బీభత్సం.. తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
సోమవారం తెరుచుకోనున్న విద్యాసంస్థలు
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ ఇక సోమవారం తెరుచుకోనున్నాయి.
చదవండి: తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం
Comments
Please login to add a commentAdd a comment