
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు రోజులుగా దంచికొడుతున్న వానలు గురువారానికి కాస్త నెమ్మదించాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్లా భారీ వర్షాలు పడ్డాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల వర్షాలు తెరిపినిచ్చాయి.
శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. అయితే ఏ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయలేదు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది.
బలహీనపడ్డ అల్పపీడనం: ఒడిశా, కోస్తాంధ్ర పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో మూడు రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
సీజన్‌లో 52.49 సెంటీమీటర్ల వర్షపాతం: ఏటా నైరుతి సీజన్‌లో 72.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. అందులో జూలై 14కి 22.66 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి ఏకంగా 52.49 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. అంటే మొత్తం నైరుతి రుతుపవనాల కాలంలో కురిసే వర్షంలో మూడింట రెండొంతులు ఇప్పటికే కురిసినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment