సంపాదకీయం: ప్రకృతి మరోసారి పగబట్టింది. పది రోజులక్రితం వచ్చిన పైలీన్ తుపాను శ్రీకాకుళం జిల్లాలోని కొబ్బరి, జీడిమామిడి, ఇతర పంటలను తుడిచిపెడితే ఇప్పుడు ఈశాన్య రుతుపవనాల వంతు వచ్చింది. అల్పపీడనం వల్ల వచ్చిపడిన భారీ వర్షాలు తొమ్మిది జిల్లాల్లో ఉన్న 12 లక్షల ఎకరాల్లోని పంటలను దారుణంగా దెబ్బతీశాయి. పాలు పోసుకుంటున్న వరిచేలు, కోతకొచ్చిన పంటలు, ధాన్యం కుప్పలు, చేతికి రాబోతున్న మొక్కజొన్న కంకులు, పొగాకు నారుమళ్లు, పత్తి, మిరప, చెరకు వంటివన్నీ నీటమునిగాయి. మార్కెట్ యార్డులకు చేరుకున్న ధాన్యం, పత్తి బస్తాలు సైతం టార్పాలిన్లు లేక నీట మునిగాయంటే ఎంతో ఆవేదన కలుగుతుంది. వర్షాలవల్ల వివిధ దుర్ఘటనల్లో చిక్కుకుని 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో జనావాసాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలవల్ల 10 సెంటీమీటర్ల నుంచి 17 సెంటీమీటర్ల వరకూ వర్షం పడింది. కొన్నిచోట్ల 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం ముంచెత్తింది.
వరస విపత్తులు రైతును అన్నివిధాలా కుంగదీస్తున్నాయి. తుపానులు, వాయుగుండాలు, భారీవర్షాలు నిర్ణీత కాలవ్యవధిలో దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రకృతి కాటేస్తున్నా వ్యవసాయాన్ని ఒక యజ్ఞంలా, ఒక బాధ్యతలా నిర్వర్తిస్తున్న రైతాంగానికి ఆపన్నహస్తం అందించడంలో మాత్రం పాలకులు విఫలమవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలను నివారించడం మన చేతుల్లో లేదు. కానీ, విలయం వచ్చిపడినప్పుడు అందుకు దీటైన విపత్తు నివారణ చర్యలు ఉంటే బాధిత ప్రాంతాల్లోని రైతులు, ఇతర ప్రజానీకం ఎంతో కొంత ఉపశమనం పొందుతారు. మళ్లీ సాధారణ స్థితికి చేరుకోగలుగుతారు. అయితే, ఆ పని సరిగా సాగడంలేదు. బాధిత రైతులకు సకాలంలో సాయం అందక అప్పులపాలవుతున్నారు. ఫలితంగా క్రమేపీ వారు వ్యవసాయానికి దూరమవుతున్నారు.
నిరుడు కొన్నాళ్లు కరవు, అటు తర్వాత భారీ వర్షాలు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. దానికితోడు నిరంతర విద్యుత్తు కోతలు పంట చేలను ఎండబెట్టాయి. ఏడు గంటలపాటు నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేస్తామని చెప్పిన పాలకులు పట్టుమని నాలుగు గంటలు కూడా ఇవ్వలేకపోయారు. ఫలితంగా వ్యవసాయోత్పత్తులు భారీగా తగ్గాయి. ఈ ఏడాది అదునుకు వర్షాలు కురిశాయని, పరిస్థితి ఆశాజనకంగా ఉన్నదని రైతాంగం భావించింది. పాత నష్టాలను కొంతైనా పూడ్చుకోగలమని అంచనావేసుకుంది. తీరాచూస్తే మొన్నటి పైలీన్ తుపాను, ఇప్పటి అల్పపీడనం దెబ్బమీద దెబ్బతీశాయి.
బాధిత రైతాంగానికి సకాలంలో సాయం అందితే ప్రకృతి దెబ్బలను కాచుకోవడానికి వారికి కొంతైనా అవకాశం ఉంటుంది. కానీ, ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టిపెట్టడంలేదు. నిరుడు నీలం తుపాను పన్నెండున్నర లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తే రాష్ట్రానికి వచ్చిన సాయం అరకొరే. వివిధ అవసరాలకు దాదాపు మూడున్నరవేల కోట్ల రూపాయలు అవసరమని రాష్ట్రం కోరగా కేంద్రం నుంచి మనకొచ్చింది రూ. 417 కోట్లు! రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మొత్తానికీ, కేంద్రం విదిల్చిన సాయానికి ఎక్కడైనా పోలికుందా? దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రానికి ప్రతిసారీ ఇలా అన్యాయమే జరుగుతున్నది. జరిగిన నష్టం ఎంతన్న అంశంతో నిమిత్తం లేకుండా కేంద్ర వ్యవసాయమంత్రి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంత అన్యాయంగా ప్రవర్తించిన శరద్ పవార్ స్వరాష్ట్రానికి మాత్రం ఎంతో ఉదారంగా రూ.1,200 కోట్లు మంజూరు చేశారు. మనతో పోలిస్తే ప్రతిపక్షం ఆధ్వర్యంలో ఉన్న గుజరాత్ వంటి రాష్ట్రం కూడా అధిక మొత్తాన్ని తెచ్చుకోగలిగింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రెండోసారి ఏర్పడటానికి ఇక్కడి నుంచి నెగ్గిన 33 మంది కాంగ్రెస్ ఎంపీలు కారణం. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏలుబడిలో ఉంది. అయినా మనకు అన్యాయమే మిగిలింది. విపత్తు వచ్చిపడినప్పుడల్లా ఏదో ఒరుగుతుందేమో, ఈ కష్టాల నుంచి గట్టెక్కగలమేమోనన్న ఆశ రైతుల్లో పుడుతోంది. కానీ, చివరాఖరికి అంతా తారుమారవుతోంది. రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి.
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పాలకులు ఆదుకోరు సరిగదా... తమ విధానాలతో రైతులపై మరింత భారం వేస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా దాన్ని మరింత ముదిరేలా చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఏ ఏ అంశాలపై దృష్టిసారించి ఉపశమనం కలగజేయాలో స్వామినాథన్ కమిటీ, జయతీఘోష్ కమిటీ వంటివన్నీ సవివరమైన నివేదికలను అందజేశాయి. కానీ, అలాంటి సిఫార్సులన్నిటికీ కేంద్ర ప్రభుత్వం వీసమెత్తు విలువనివ్వడంలేదని దాని విధానాలే నిరూపిస్తున్నాయి. ఆపత్కాలంలో రైతును ఆదుకోవడం సంగతలా ఉంచి, వ్యవసాయ ఇన్‌పుట్ ధరలు భారీగా పెంచుతూ వారి కష్టాలను రెట్టింపు చేస్తోంది.
అలాగని మార్కెట్లో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయా అంటే అదీలేదు. ప్రతి దశలోనూ రైతుకు నిలువుదోపిడీయే అనుభవంలోకి వస్తున్నది. కరీంనగర్, హుస్నాబాద్, జగిత్యాల, జమ్మిగుంట మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు కొనుగోళ్లకు దిగకపోవడంతో ధాన్యం, పత్తి, మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయంటే ఎవరిని తప్పుబట్టాలి? కొనుగోళ్లు చురుగ్గా ఉండేలా చూడలేని అధికార యంత్రాంగం కనీసం రైతులకు టార్పాలిన్లు కూడా అందించ లేకపోయింది. క్షామం ఏర్పడినప్పుడూ పట్టించుకోక, వానలు ముంచెత్తినప్పుడూ ఆదుకోవడానికి ముందుకురాక పాలకులు చేస్తున్న మహత్కార్యమేమిటో అర్ధం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ చొరవ ప్రదర్శించాలి. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం మానుకుని రైతాంగాన్ని ఆదుకోవాలి.
రైతన్నకు ఆపత్కాలం!
Published Fri, Oct 25 2013 12:55 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement