పాత బస్ డిపో నుంచి ఎన్జీవోస్ కాలనీ మార్గంలో రోడ్డు పైకి చేరిన వరద
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. కొన్ని జిల్లాల్లో సోమవారం ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిం డిపోయాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమో దైంది. వర్షాల కారణంగా ఓ చిన్నారి సహా ఇద్దరు మృత్యు వాత పడ్డారు. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
జిల్లాలో సోమవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో 17.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాల్వంచలో 16.4, చుంచుపల్లిలో 16.1, లక్ష్మీదేవిపల్లిలో 14.8, దమ్మపేటలో 12.6, టేకులపల్లిలో 11.4, అన్నపురెడ్డిపల్లిలో 10.8, ముల్కలపల్లిలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. 2,491 ఎకరాల్లో వరి, 1,531 ఎకరాల్లో పత్తి పంటకు నష్టంవాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కిన్నెరసాని జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా పొంగిన వాగులు, చెరువులతో జిల్లాలో వందకు పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షంతో గనుల్లో నీరు నిలవడంతో కొత్తగూడెం ఏరియాలో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షపాతం నమోదైంది.
పాల్వంచలో రహదారిపైకి వరద చేరడంతో కొట్టుకుపోతున్న వాహనాన్ని నిలబెడుతున్న స్థానికులు
వరద నీటిలో చిక్కుకుని చిన్నారి మృతి
పాల్వంచ పట్టణంలోని జయమ్మ కాలనీకి చెందిన శనగ రవి – నాగమణి దంపతుల కుమార్తె అంజలి వరద నీటి ప్రవాహంలో చిక్కుకుని మృతి చెందింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దయ్యింది. అత్యధికంగా సంగెంలో 14.8 సెం.మీ, నడికుడలో 14.5, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్‌లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. 28 కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లోని బంధువుల వద్దకు వెళ్లిపోతున్నారు.
వరదలో కొట్టుకుపోయిన భవన నిర్మాణ కార్మికుడు
జిల్లాలోని దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం రెడ్డి వెంకటరెడ్డి (42) అనే భవన నిర్మాణ కార్మికుడు వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. గిర్నిబావిలో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఉధృతంగా ప్రవహిస్తున్న ఈదులచెరువు మత్తడిలో కొట్టుకుపోయాడు. గమనించిన గ్రామస్తులు అతనిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొద్దిదూరంలో మర్రిచెట్టుకు తట్టుకుని ఉన్న వెంకటరెడ్డి మృతదేహాన్ని స్థానికులు ఒడ్డుకు చేర్చారు.
కనువిందు చేస్తున్న జలపాతాలు
ములుగు జిల్లా వాజేడు మండలంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం కనువిందు చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీమునిపాద జలపాతం కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
కరీంనగర్, పెద్దపల్లిలో..
కరీంనగర్ జిల్లాలో జడివాన కురుస్తోంది. అత్యధికంగా కరీంనగర్‌లో 6.3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఉదయ్‌నగర్ కాలనీలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. జగిత్యాలలో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీవాన మొదలైంది. జగిత్యాల, మెట్‌పల్లిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం వర్షం కొద్దిగా తెరపినిచ్చింది.
ఉమ్మడి పాలమూరులో..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజంతా ముసురు వర్షం కమ్ముకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కౌకుంట్ల–ఇస్రంపల్లి మధ్యవాగులో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం చౌటబెట్ల, మాచినేనిపల్లి గ్రామాల మధ్య కేఎల్‌ఐ కాల్వ కోతకు గురైంది.జిల్లాలో దాదాపు 500 ఇళ్లు దెబ్బతిన్నాయి.
జూరాల ప్రాజెక్టు వద్ద 20 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీరు
ఉమ్మడి మెదక్..
మెదక్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ముసురుగా ప్రారంభమైన వర్షం సోమవారం సాయంత్రానికి భారీ వర్షంగా మారింది. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సిద్దిపేట జిల్లాలో కూడవెల్లి, మోయతుమ్మెద, తాడూరు, హల్దీ వాగులు స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో వరంగల్– సిద్దిపేట దారిపై రాకపోకలు పూర్తిగా నిలిచాయి.
దుర్గమ్మ ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతున్న మంజీరానది
నిజామాబాద్‌లో..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా సోమవారం వానలు కురిశాయి. బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలోని గ్రామాల్లో మధ్యాహ్నం భారీ వడగళ్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఆర్మూర్ మండలం ఆలూరులో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో గడచిన పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం కూడా చాలాచోట్ల గరిష్టంగా 5 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది.
ఇంటిపై పిడుగుపాటు
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దినేష్ ఇంటిపై పిడుగు పడటంతో గోడలు నెర్రెపడ్డాయి. టీవీ, ఫ్రిజ్, వంటపాత్రలు ధ్వంసమయ్యాయి.
రవీంద్రనగర్ నుంచి కౌటాల మార్గంలో వంతెన పైనుంచి పారుతున్న వరద
కుమురం భీం జిల్లాలో..
జిల్లాలోని చింతలమానెపల్లి, కౌటాల మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. చింతలమానెపల్లి మండలంలోని నాగులవాయి వాగు, చింతలపాటి వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. చింతలమానెపల్లి నుంచి కౌటాల మండలానికి వెళ్లే మార్గంలో చింతలపాటి వద్ద వంతెన పైనుంచి వరద ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అడెపల్లి, రణవెల్లి, కారెబ్బెన, రుద్రాపూర్, డబ్బా తదితర గ్రామాల పరిధిలోని పంట భూములు నీట మునిగి బురద మేట వేశాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి.
అడెపల్లిలో నీటమునిగి బురదమేట వేసిన పత్తిపంట
పిడుగుపాటుకు ఒకరి మృతి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కొలాంగూడలో మొక్కజొన్న పంటచేనులో మంచె కింద ఉన్న ఆత్రం రమేశ్(28)పై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నీట మునిగిన వరి పొలాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాతో పాటు హైదరాబాద్ జంటనగరాల్లో కురిసిన వర్షానికి మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువులు నిండాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆలేరు – సిద్దిపేట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 25 ఇళ్లు కూలిపోయాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సోమవారం 1.67 సెం.మీ సగటు వర్షపాతం నమోదు అయ్యింది.
రవీంద్రనగర్ నుంచి కౌటాల మార్గంలో వంతెన పైనుంచి పారుతున్న వరద
ముగ్గురు విద్యార్థినులను కాపాడిన స్థానికులు
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండ గ్రామంలో వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురు విద్యార్థినుల ప్రాణాలను గ్రామస్తులు కాపాడారు. గ్రామానికి చెందిన గజ్జి ఆకాంక్ష, మేడిపల్లి వర్షిణి, మేడిపల్లి కావ్యలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డుపై భారీ వరద వెళ్తుండగా దాటేందుకు ప్రయత్నించారు. అయితే వరద ఉధృతికి కొట్టుకొని పోయి సమీపంలో ఉన్న చెట్లకు చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు వెంటనే తాళ్ల సాయంతో ముగ్గురిని సురక్షితంగా బయటికి తీశారు.
పాల్వంచలో రహదారిపైకి వరద చేరడంతో కొట్టుకుపోతున్న వాహనాన్ని నిలబెడుతున్న స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment