సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో పుడమి పులకరిస్తోంది. కృష్ణా, గోదావరి, వంశధార, తుంగభద్ర, పెన్నా, చిత్రావతి నదుల్లో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిండుకుండల్లా పొర్లుతున్నాయి. రాయలసీమలో ఐదారు వందల అడుగుల లోతులో మాత్రమే నీరుండే కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉబికివస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా గాలివీడు, చిత్తూరు జిల్లా వడమాలపేట లాంటి ప్రాంతాల్లో కొన్ని బోర్ల నుంచి మోటార్లు ఆన్ చేయకుండానే నీరు ఉబికి రావడం గమనార్హం. భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నీట మునిగి రైతులు కొంత ఆందోళన చెందుతున్నా ఇక రెండేళ్లు కరువు ఉండదని, పుష్కలంగా పంటలు పండించుకోవచ్చని ఊరట చెందుతున్నారు.
ఇక నీటి సమస్య ఉండదు...
‘2014 నుంచి 2018 వరకూ కరువుతో సతమతమయ్యాం. గత ఏడాది, ఈ సంవత్సరం మంచి వర్షాలు పడటంతో దుర్భిక్షం ఛాయలు కనిపించకుండా పోయాయి. పండ్ల తోటలకు ఇక రెండు మూడేళ్లు నీటి సమస్య ఉండదు’ అని అనంతపురం జిల్లా నంబులపూలకుంటకు చెందిన నారాయణరెడ్డి, పెరవలికి చెందిన వెంకటప్ప సంతోషం వ్యక్తం చేశారు.
లోటు మాటే లేదు..
ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 27.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఒక్క జిల్లాలో కూడా వర్షపాత లోటు లేకపోవడం గమనార్హం. ఇదే కాలంలో రాష్ట్రంలో 68.67 శాతం ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదైంది. 26.71 శాతం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా కేవలం 4.62 శాతం మండలాల్లో మాత్రమే సాధారణం కంటే లోటు వర్షపాతం రికార్డయింది. వైఎస్సార్ జిల్లాలో సాధారణం కంటే 67.7 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దశాబ్దాలుగా దుర్భిక్షం తాండవిస్తున్న అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 58.2 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. రాష్ట్రంలో 460 మండలాల పరిధిలో అధిక వర్షపాతం, 79 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం 31 మండలాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది.
జిల్లాలవారీగా వర్షపాతం వివరాలు
(1-6-2020 నుంచి 22-10-2020 వరకు వర్షపాతం మిల్లీమీటర్లలో)
జిల్లా | సాధారణం | కురిసింది తేడా శాతం | తేడా శాతం |
శ్రీకాకుళం | 878.2 | 726.7 | -17.3 |
విజయనగరం | 848.7 | 806.6 | -5.0 |
విశాఖపట్నం | 895.3 | 1004.7 | 12.2 |
తూర్పుగోదావరి | 947.3 | 1326.3 | 40.0 |
పశ్చిమగోదావరి | 936.6 | 1323.2 | 41.3 |
కృష్ణా | 823.1 | 1075.0 | 30.6 |
గుంటూరు | 632.5 | 835.6 | 32.1 |
ప్రకాశం | 540.5 | 652.9 | 20.8 |
నెల్లూరు | 470.2 | 559.3 | 18.9 |
చిత్తూరు | 545.1 | 770.4 | 41.3 |
వైఎస్సార్ | 486.8 | 816.3 | 67.7 |
అనంతపురం | 424.4 | 671.5 | 58.2 |
కర్నూలు | 559.3 | 878.6 | 57.1 |
Comments
Please login to add a commentAdd a comment