సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్: రహదారులకు గండ్లు. రోడ్లపై పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు, రైలు రవాణా స్తంభించింది. నల్లగొండ జిల్లాలోనైతే రోడ్డు, రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధానంగా హైదరాబాద్-విజయవాడలను కలిపే 65వ నెంబరు జాతీయ రహదారిని వరద నీరు ముంచెత్తింది. కట్టంగూరు మండల పరిధిలోని మునుకుంట్ల, కలిమెర, కట్టంగూరు చెరువుల నుంచి వచ్చిన వరద నీరు ముంచెత్తడంతో కట్టంగూరు వద్ద హైవేపై నీరు పొంగిపొర్లుతోంది. దాంతో అధికారులు అప్రమత్తమై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. విజయవాడ వైపు నుంచి వస్తున్న వాహనాలను సూర్యాపేట వద్ద దారి మళ్లించి జనగామ మీదుగా హైదరాబాద్‌కు పంపుతున్నారు. ైదాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన దాదాపు 50 బస్సులను రద్దు చేసినట్టు ఎంజీబీఎస్ ఏటీఎం-1 సత్యనారాయణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
శుక్రవారం రాత్రి 8.45 గంటల నుంచి అటువైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కొన్నిం టిని జనగాం, తిరుమలగిరి, సూర్యాపేట మీదగా పంపుతున్నామని, దాంతో 45 కి.మీ. దూరం పెరుగుతుందని చెప్పారు. ఇక బీబీనగర్-నడికుడి రైల్వే మార్గంలో తిప్పర్తి మండలం రామలింగాల గూడెం వద్ద వరద నీరు రైల్వే ట్రాక్‌ను తాకుతూ ప్రవహిస్తోంది. దాంతో రైల్వే సర్వీసులనూ నిలిపివేశారు. గుంటూరు-మాచర్ల నుంచి నాగార్జున సాగర్ మీదుగా పెద్దవూర, కొండమల్లేపల్లి గుండా హైదరాబాద్ వచ్చే మార్గం మాత్రమే సాఫీగా ఉంది. మరోవైపు శ్రీశైలం-విజయవాడ మధ్య చంద్రవంక ప్రవాహ ఉధతితో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌ను వేరే మార్గంలోకి మళ్లించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్లు వందలాది కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి.
విజయవాడ హైవే బంద్
Published Sat, Oct 26 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement