
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక వర్షపాతానికి చిరునామాగా నిలిచిన చిరపుంజిలో గత 27 ఏళ్లలో జూన్‌లో ఎన్నడూలేనంతటి భారీ వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు అంటే ఒక రోజులో ఏకంగా 811.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ 1995 తర్వాత జూన్‌లో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది.
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లే ఇంతటి వర్షం పడిందని వెల్లడించింది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు మాసిర్రమ్‌లో 710.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం. 1974–2022 కాలానికి ప్రపంచంలోనే అత్యంత అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా మాసిర్రమ్ గతంలో రికార్డులకెక్కడం తెల్సిందే. చిరపుంజి, మాసిడ్రమ్ రెండూ దాదాపు 10 కి.మీ.ల దూరంతో మేఘాలయలోనే ఉన్నాయి.