సాక్షి, హైదరాబాద్: నగరంలో ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ఖైరతాబాద్‌లో వాన భారీ ఎత్తున కురిసింది.
బొమ్మల రామారం, తుర్కపల్లి లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం పడింది. ఎల్బీనగర్, హయత్ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈదురు గాలుల కారణంగా సిటీలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం మరింత కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
(దొంగ తెలివి! పని మనిషిగా చేరిన 24 గంటల్లోనే దోపిడీ.. ఎప్పటిలా మళ్లీ సిటీకి)
తప్పిన పెను ప్రమాదం
ట్యాంక్ బండ్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి భాగమతి టూరిస్ట్ బోటు ట్యాంక్ బండ్‌లో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బోటులో 40 మంది పర్యాటకులున్నారు. అయితే, అప్రమత్తమైన సిబ్బంది వారిని కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 40 మంది టూరిస్టులతో బుద్ధ విగ్రహం వద్దకు బోటు బయల్దేరింది. బుద్ధ విగ్రహం చేరుకునే సమయంలో భారీగా ఈదురు గాలుల వీచాయి. దీంతో అదుపు తప్పిన బోటు, కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని ముందే గుర్తించి టూరిజం సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్పీడ్ బోట్ల ద్వారా బోట్‌ను బోట్స్ క్లబ్ వద్ద ఒడ్డుకు చేర్చారు. పర్యాటకులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.
నిమ్మకాయంత సైజులో రాళ్లు..
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా పడటంతో భారీ ఎత్తున పంట నష్టం సంభవించిందని రైతులు వాపోయారు. తొగుట మండలం గుడికందుల, గోవర్ధనగిరిలో నిమ్మకాయంత సైజులో రాళ్లు పడ్డాయని స్థానికులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, బీబీ నగర్ లో ఉరుములు, మెరుపులతో కుడిన భారీ వర్షం కురిసింది.
(Telangana: డిగ్రీ చదువుతూనే 10 వేలు సంపాదన.. ఎలా అంటే..!)
Comments
Please login to add a commentAdd a comment