
విశాఖ తీరంలో అల్లకల్లోలంగా మారిన సముద్రం
- రానున్న 48 గంటల్లో ఆంధ్ర- ఒడిశా మధ్య తీరం దాటనున్న తుపాను
- కోస్తాంధ్రకు మరో రెండ్రోజులు భారీ వర్షాలు... బందరుకు సమీపంలో కేంద్రీకృతం
- హైఅలర్ట్ ప్రకటించిన వాతావరణ విభాగం... గంటకు 120 కి.మీ. వేగంతో పెనుగాలులు
- ఒడిశా వైపు పయనించే అవకాశం
సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం/ చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా మారనుంది. నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రి 10 గంటలకు మచిలీపట్నానికి దక్షిణంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశలో నెమ్మదిగా కదులుతుండడంతో బలం పుంజుకుంటోంది. ఫలితంగా గురువారం ఉదయానికి మచిలీపట్నం చేరువలోకి వచ్చే సరికి తుపానుగా బలపడనుంది.
అనంతరం మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. ఈ తీవ్ర తుపాను గురు, శుక్రవారాల్లో పెను ప్రభావం చూపనుంది. ఇది ఒడిశా వైపు పయనించి అక్కడ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీంతో భారత వాతావరణ విభాగం హై అలెర్ట్ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో మరో 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ బుధవారం రాత్రి వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అక్కడక్కడ 30 సెం.మీలకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర కోస్తాలో గంటకు 95 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తాలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఫలితంగా కచ్చా ఇళ్లకు, గుడిసెలకు నష్టం వాటిల్లుతుందని, రోడ్లు, కల్వర్టులు దెబ్బతింటాయని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని, కాలువలకు గండ్లు పడతాయని ఐఎండీ వెల్లడించింది. గురువారం ఏర్పడబోయే తుపానుకు మాల్దీవులు దేశం సూచించిన పేరు ‘రావోను’గా నామకరణం చేసే అవకాశం ఉంది. దీనిని గురువారం అధికారికంగా ప్రకటిస్తారు.
తుపాను ప్రభావం వల్ల చెన్నై, పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా వర్షం కొనసాగడంతో పలు ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం కలిగింది. తుపాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు 3రోజుల పాటు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.
అండమాన్‌ను తాకిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు బుధవారం అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో అండమాన్, నికోబార్ దీవుల్లోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు కేరళను నిర్ణీత జూన్ ఒకటో తేదీకంటే ముందుగానే తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈసారి రోహిణిలో రోళ్లు పగలవ్!
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి నందున ఈసారి వచ్చే రోహిణి కార్తె అంతగా ఆందోళనకరం కాదని వాతావరణ నిపుణులు భరోసా ఇస్తున్నారు.
రాష్ట్రంలో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించింది. బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో బుధవారం గరిష్టంగా 35.5 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ 54% మేర నమోదైంది. రానున్న 24 గంటల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయి.