
మరో 48 గంటలు చాలా ప్రమాదం..
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అష్టకష్టాలు పడుతున్న చెన్నై వాసులకు మరింత ముప్పు పొంచి ఉంది. రోడ్లు, కాలనీలు, రైల్వే ట్రాక్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు జలమయంకావడంతో ఇప్పటికే జనజీవనం స్తంభించిపోగా.. చెన్నైలో మరో 48 గంటలు పాటు భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ 48 గంటలు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించింది. మరో 72 గంటల పాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.
చెన్నైలో తాగు నీరు, నిత్యావసర వస్తువులు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే రోడ్లు నదులను తలపిస్తున్నాయి. చెన్నైలో రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడం వల్ల సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతోంది. చెన్నై వెళ్లేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే బలగాల తరలింపునకు వాతావరణం అనుకూలించలేదని రక్షణ మంత్రి మనోమర్ పారికర్ ప్రకటించారు. చెన్నైలో భారీ వర్షాలు పడితే మరింత నష్టం కలిగే ప్రమాదముంది.