సాక్షి, సిటీబ్యూరో: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు! రాష్ట్రంలో ఉద్ధృతంగా కురుస్తున్న వర్షాలు కూరగాయల ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల వరుసగా ముసురు వానలు పడుతుండటంతో తోటల్లోని కూరగాయలను కోసేందుకు వీలులేకుండా పోయింది. పొలాలన్నీ బురదమయం కావడంతో కాయ, ఆకు కూరలను తెంచడం కష్టంగా మారింది. దీంతో నగర మార్కెట్లకు వచ్చే దిగుమతులపై ప్రభావం పడింది. కేవలం శివారు జిల్లాలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వానలు పడుతుండడంతో అక్కడి నుంచి కూరగాయల రవాణా నిలిచిపోయింది.
ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారింది. నిన్నామొన్నటి వరకు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు నగర ప్రజల అవసరాలను తీర్చినప్పటికీ, సోమవారం నుంచి ఇవి కూడా కరిగిపోవడంతో కూరగాయల రేట్లు మరింత పెరిగే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కూరగాయలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో టమాటా కేజీ రూ.30 నుంచి రూ.40 ఉండగా.. సోమవారం దీని ధర కిలోకు రూ. 50 వరకు పలికింది. పచ్చిమిర్చీ కూడా ఘాటెక్కింది. ఏకంగా వాటి ధర కిలో రూ. రూ.60, రూ.80 వరకు చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా కిలో రూ.20 నుంచి రూ.30 పెరిగాయి.
పుంజుకోని దిగుమతులు
మార్కెట్లకు శుక్రవారం నుంచి కూరగాయల దిగుమతులు రాలేదు. రోజు వంద శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అయితే గత నాలుగైదు రోజుల నుంచి 30–50 శాతం మాత్రమే నగర హోల్‌సేల్ మార్కెట్‌లకు దిగుమతి అయినట్లు మార్కెటింగ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. బోయిన్‌పల్లి మార్కెట్‌కు సోమవారం కేవలం 12 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్ 4 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యాయి. అదే సాధారణ రోజుల్లో బోయిన్‌పల్లిలో మార్కెట్‌కు సగటున 32 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్‌కు 10 వేల క్వింటాళ్ల దిగుమతులు అవుతాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయల అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment