బంద్ కారణంగా ఖాళీగా దర్శనమిస్తున్న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్
సాక్షి, అమరావతి: గులాబ్ తుపానుతో భారీవర్షం కురుస్తున్న వేళ పటిష్ట బందోబస్తు మధ్య రాష్ట్రంలో సోమవారం ‘భారత్ బంద్’ ప్రశాంతంగా ముగిసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జరిగిన దేశవ్యాప్త బంద్‌లో రాజకీయ పార్టీలు తమ జెండాలను పక్కనబెట్టి రైతు సంక్షేమమే అజెండాగా పాల్గొన్నాయి. జన ప్రయోజనమే తమ ప్రాధాన్యత అని నినదించాయి. రాష్ట్రంలో అధికార వైఎస్సార్‌సీపీ బంద్‌కు మద్దతు తెలపడంతో బస్సులు, బడులు బంద్ అయ్యాయి. దారులు మూసుకుపోయాయి. రైళ్లు రద్దయ్యాయి. వాణిజ్య సముదాయాలు, వ్యాపారకేంద్రాలు మధ్యాహ్నం వరకు మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతోపాటు భారీవర్షం కూడా తోడవడంతో అత్యవసరమైతే తప్ప జనం రోడ్ల మీదకు రాలేదు. సినీ థియేటర్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. పాడేరు ఏజెన్సీలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అంబులెన్స్, డాక్టర్లు.. ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలిపినట్టు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ప్రకటించింది.
వర్షాలను లెక్కచేయకుండా ఉదయం ఏడు గంటలకే వామపక్షాల, కార్మికసంఘాల నేతలు ఆందోళనకారులతో కలిసి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయవద్దని కోరుతూ భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుపతిలో రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు.
కార్మిక కర్షక మైత్రి, లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలని, సాగురంగాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కాపాడాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దని, లేబర్ కోడ్‌లను రద్దుచేయాలని, రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. భారత్ బంద్‌కున్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను, వైరుధ్యాలను పక్కనబెట్టి బంద్‌లో పాల్గొన్నాయి. రైతుసంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వర్షంలోనే విశాఖలో బంద్ కొనసాగింది. నిరసనకారులు రోడ్లపై బైఠాయించి బంద్‌లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోను బంద్ విజయవంతమైంది. పలుచోట్ల వినూత్నంగా కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలిపారు. రైతుల గుండెచప్పుడు ఢిల్లీకి వినిపించడంలో సహకరించినందుకు ధన్యవాదాలని కిసాన్ మోర్చా నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉంది.
రైతు సంఘాల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం
– వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి
సాక్షి, అమరావతి: రైతు సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా వైఎస్సార్‌సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా దేశవ్యాప్త రైతు సంఘాల ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment