
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి తెలిపారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును రైతులు ఎన్నటికీ నమ్మరని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీ లేదన్నారు. పైగా ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువే అన్నారు. చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పండగ చేశారని చెప్పారు. ఆ మహానేత కుమారుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతును రాజును చేశారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు టీడీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇందులో ఏం చెప్పారంటే..
► రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట వేరుశనగ. 2014–15 నుండి ఇప్పటి దాకా ఈ పంట వివరాలు తెప్పించుకుని చూస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయి.
► రాయలసీమలో కేవలం 3 శాసన సభ స్థానాలకే టీడీపీని ప్రజలు పరిమితం చేశాక కూడా, అక్కడి ప్రజలను ఇంకా మోసం చేసేందుకు టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తుండటం దారుణం.
► కరువు, చంద్రబాబు కవల పిల్లలుగా సాగిన పాలన అందరికీ తెలుసు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని.. పగటి పూటే తొమ్మిది గంటలు నిరంతరంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి మాట తప్పారు. ఈ విషయాలు రైతులెవరూ మరచిపోరు.
► ఇలాంటి చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ రోజు వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉంది. కోవిడ్ సంక్షోభంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రకటించిన సమయానికి పథకాలు అమలవుతున్నాయి.
► క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు కనిపిస్తే, ప్రభుత్వం దృష్టికి తెచ్చి.. నిర్మాణాత్మక ప్రతి పక్షంగా వ్యవహరించకపోగా.. కుల, మతాల పేరుతో, అబద్ధపు ప్రచారాలతో లబ్ధిపొందేందుకు యత్నిస్తున్న ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడటం దేశంలో ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment