ఆర్డినెన్స్ చాలదు.. చట్టం చేయాలి: ఎంవీఎస్ నాగిరెడ్డి
వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి
విజయవాడ, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర కేబినెట్ చేసిన ఆర్డినెన్స్ చాలదని, పార్లమెంట్‌లో బిల్లుపెట్టి చట్టంచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కృష్ణా-గోదావరి డెల్టా రైతు సంఘాలు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం పార్లమెంట్ లో చట్టం చేసి ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. వాస్తవానికి రాష్ట్ర పునర్విభజన బిల్లులోనే ఈ అంశాన్ని చేర్చి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
యూపీఏ హయాంలో ఆర్డినెన్స్ చేసినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం పొందలేదని గుర్తుచేశారు. అప్పుడు నోరు మెదపని కేసీఆర్ ఈరోజు ఆందోళన చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నిర్వాసితుల పేరుతో ఇరుప్రాంత రైతులు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఆయన బంద్‌కు పిలుపునిచ్చారని విమర్శించారు. నిర్వాసితుల కోసమే అయితే కోల్‌మైనింగ్ కోసం సత్తుపల్లి ప్రాంతంలో 25గ్రామాల ప్రజలకు అన్యాయం చేస్తూ నూతన భూసేకరణ చట్టం రావడానికి ఒకరోజు ముందు భూసేకరణ చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్టుగా రూపుదిద్దుకుంటున్న పోలవరం ప్రాజెక్టును రాజకీయ ఉద్దేశంతో అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గితే డెడ్‌స్టోరేజి మాత్రమే మిగులుతోందని, చెక్‌డ్యాంగా మారుతుందేగానీ రిజర్వాయర్ కాదన్నారు. ఎత్తు తగ్గించాలని చేస్తున్న వాదన సరికాదన్నారు.
ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మిస్తుంటే నోరుమెదపని నాయకులు గోదావరి చివరన ప్రాజెక్టు నిర్మిస్తుంటే రాజకీయం చేయడం తగదన్నారు. 1980లోనే మూడు రాష్టాల ముఖ్యమంత్రులు ప్రాజెక్ట్ ఎత్తు 150 అడుగులుగానే ఉండాలని సంతకాలు చేశారని గుర్తుచేశారు. కిరణ్ ప్రభుత్వం కూడా రెండుసార్లు టెండర్లు పిలిచి ఎత్తును 150 అడుగులుగానే నిర్ధారించిందన్నారు. పార్లమెంట్ మాజీ సభ్యుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్, శివాజీ, కె.గోపాలకృష్ణంరాజు పాల్గొన్నారు.