నేడు కూడా సిటీలో భారీ వర్షాలు
హైదరాబాద్:
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందువల్ల బుధవారం కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి పేర్కొన్నారు. నగరంలో 12 గంటల పాటు రాత్రంతా భారీ వర్షం పడిందని, ఈరోజు కూడా నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు రాత్రి కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లుపై ఏర్పడిన గోతులు వాహనచోదకులకు నరకం చూపిస్తున్నాయి.
అల్వాల్, కూకట్ పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. అల్వాల్‌లో చాలా చోట్ల అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరింది. చెరువుల్లో నుంచి కాలనీల్లోకి వరద నీరు వచ్చింది. నిజాంపేట బాలాజీనగర్‌లో 40 శాతం అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఖైరతాబాద్ నుంచి మియాపూర్ మరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ప్రాంతం వర్షపాతం
షాపూర్ నగర్‌లో- 16 సెం.మీ
కుత్బుల్లాపూర్- 9 సెం.మీ
బొల్లారం - 9 సెం.మీ
మాదాపూర్- 8 సెం.మీ
తిరుమలగిరి- 6.5 సెం.మీ
అమీర్‌పేట్- 6 సెం.మీ
నాచారం, కాప్రా, ఆసిఫ్ నగర్‌లలో కూడా భారీ వర్షం పడింది.