వరుణుడు బీభత్సం సృష్టించాడు. తుపాను ప్రభావంతో రాయచూరు, గుల్బర్గా జిల్లాల్లోని రాయచూరు, లింగస్గూరు, దేవదుర్గ తాలూకాలతోపాటు గుల్బర్గా జిల్లా సేడం తాలూకాలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో వంకలు వాగులు పొంగిపొర్లాయి.
దేవదుర్గ/రాయచూరు సిటీ/లింగస్గూరు/సేడం, న్యూస్‌లైన్ : వరుణుడు బీభత్సం సృష్టించాడు. తుపాను ప్రభావంతో రాయచూరు, గుల్బర్గా జిల్లాల్లోని రాయచూరు, లింగస్గూరు, దేవదుర్గ తాలూకాలతోపాటు గుల్బర్గా జిల్లా సేడం తాలూకాలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో వంకలు వాగులు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలి భారీగా ఆస్తి నష్టం జరిగింది.
పొలాలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాయచూరు తాలూకా యంకరాళ వద్ద వాగు ఉప్పొంగి ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యంకరాళ్లు నుంచి అర్షలిగి వెళ్లె రహదారి కోసుకొని పోవడంతో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దాదాపు వందకు పైబడిన ఇళ్లు కూలి పోయాయి. వర్షబాధిత ప్రాంతాలను రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే తిప్పరాజు, తాలూకా పంచాయితీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, ముక్తియార్లు సందర్శించారు. బాధితులకు పరిహారంతో పాటు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అదేవిధంగా సేడంలోని నృపతుంగ కాలేజీ రోడ్డు సమీపంలో కాలువలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ఊడగి గ్రామానికి చెందిన ఖయ్యూమ్ పాటిల్, మరెప్ప గల్లంతయ్యారు. ఎస్‌ఐ పరశురామ్ వనంజకర్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
మరో వైపు పట్టణంలోని కోడ్లా క్రాస్, బసవనగర్ తాండా, చోటిగిరణి తాండా, రెహమత్‌నగర్, ఇందిరానగర్ కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి మురికి నీరు ప్రవేశించి ఆహార ధాన్యాలు, గృహోపకరణ వస్తువులు పాడై పేదల పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కరెంట్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.