భీమమ్మ మృతదేహం, మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ ఉపేందర్
బషీరాబాద్ : అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్మాయి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తాండూరు రూరల్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్మాయి గ్రామానికి చెందిన సందాపురం భీమమ్మ(38), ఎల్లప్ప భార్యభర్తలు. వీరు చాలా కాలంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసముంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారు. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన తగాదాలతో ఐదేళ్ల పాటు విడిపోయారు. మళ్లీ పెద్దల సమక్షంలో పెట్టిన పంచాయతీతో ఐదు నెలల క్రితం మళ్లీ వీరిద్దరూ ఒక్కటయ్యారు.
అప్పటి నుంచి వీరి కాపురం బాగానే సాగింది. అయితే రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన భీమమ్మను భర్త ఎల్లప్ప వెంటనే రావాలని ఎక్మాయికి తీసుకువచ్చాడు. అదే రోజు రాత్రి 10 గంటల తర్వాత భార్యతో గొడవకు దిగాడు. తాను దూరంగా ఉన్న కాలంలో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో శారీరకంగా హింసించాడు. అంతడితో ఆగకుండా ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో భార్య భీమమ్మ తలపై విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో ఆమె ఇంట్లో అపస్మారకస్థితిలో పడిపోయింది. విషయం ఇరుగు పొరుగు వారికి తెలియడంతో భర్త ఇంట్లో నుంచి పరారయ్యాడు.
అప్పటికే సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఉపేందర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యను తీవ్రంగా కొట్టి పారి పోతున్న భర్త ఎల్లప్పను గాలించి అదుపులోకి తీసుకున్నారు. అయితే కొన ఊపిరితో ఉన్న భీమమ్మను బతికించేందుకు సీఐ 108కు సమాచారం అందించాడు. కాగా ఆ వాహనంలోని సిబ్బందిని భీమమ్మను పరీక్షించగా అప్పటికే ఆమె మృతిచెందింది. ఈ ఘనటపై భీమమ్మ కొడుకు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఎల్లప్పను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment