బషీరాబాద్, న్యూస్‌లైన్: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అత్తింటివారే ఆమెను చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన బషీరాబాద్‌లో గురువారం ఉదయం వెలుగుచూసింది. ఎస్‌ఐ పరమేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. బషీరాబాద్ గోసాయికాలనీకి చెందిన ఖాసీం పాషా 13 ఏళ్ల క్రితం కర్ణాటక సరిహద్దు గ్రామమైన షాబాద్‌కు చెందిన రిజ్వాన్‌బేగం(30)ను వివాహం చేసుకున్నాడు.
వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఖాసీంపాషా స్థాని కంగా కిరాణాదుకాణం నిర్వహిస్తున్నాడు. 3 నెలల క్రితం ఈయన యాలాల మండలం ఘోరేపల్లికి చెందిన పర్వీన్‌బేగంను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదటి భార్యను వేధించసాగాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి రిజ్వాన్‌బేగం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గొంతుకు తాడుతో ఉరివేసినట్లుగా కమిలిపోయిన ఆనవాళ్లు కనిపించాయి. ఖాసీంపాషా సమాచారంతో రిజ్వాన్ బేగం తల్లిదండ్రులు బషీరాబాద్‌కు చేరుకున్నారు.
రిజ్వాన్‌బేగంను భర్త ఖాసీంపాషా, అత్త బేగంబీ, మరిది అబ్దుల్ కరీం, ఆడపడుచు ఫరీదాబేగం కలిసి హత్య చేశారని ఆరోపించారు. గురువారం మృతురాలి సోదరుడు సలీం ఫిర్యాదు మేరకు తాండూరు రూరల్ సీఐ రవి, బషీరాబాద్ ఎస్‌ఐ పరమేశ్వర్‌గౌడ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు ఖాసీంపాషాను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
వివాహిత అనుమానాస్పద మృతి
Published Thu, Feb 13 2014 11:53 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement