జీవన్గీలో రైతుకు చెక్కు, పాసు పుస్తకం అందజేస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి
బషీరాబాద్(తాండూరు) : స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు రైతుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అమలు చేయనివిధంగా టీఆర్‌ఎస్ సర్కారు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందని చెప్పారు. శనివారం ఆయన బషీరాబాద్ మండలం జీవన్గీ, దామర్‌చెడ్, బాద్లాపూర్ గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కుంటుపడిపోయిన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు.
బీడుభూములను సాగులోకి తీసుకురావడానికి ప్రాజెక్టుల నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణ, నిరంతర ఉచిత విద్యుత్, ఎకరాకు రూ.4వేల పెట్టుబడి సాయం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పండించిన పంటకు గిట్టుబాటు ధర తదితర కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఖరీఫ్, రబీ రెండు పంటలకు రూ. 4వేల చొప్పున ఏడాదికి రూ.8వేల పెట్టబడి సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రూ.12వేల కోట్లతో ఈ పథకాన్ని రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతిగా నిలిచిందనడానికి అమలు చేస్తున్న పథకాలే నిదర్శనమని తెలియజేశారు.
జిల్లాలో 243.33కోట్ల నిధులు ఈ ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడి సాయంగా ఇస్తున్నామని చెప్పారు. మళ్లీ నవంబర్‌లో రెండో విడత కింద సాయం చేస్తామన్నారు. ఏళ్ల తరబడి భూ వివాదాలతో కార్యాలయాల చుట్టూ తిరిగిన రైతులకు భూ ప్రక్షాళనలో భాగంగా సమస్యలను పరిష్కరించి నేరుగా రైతుల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం తెలంగాణ సర్కారు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలియజేశారు.
రైతులు పెట్టుబడి సాయాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకోకుండా కేవలం లాగోడి కోసమే వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా బషీరాబాద్ మండలంలో 12వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. తాండూరు ఆర్డీఓ వేణు మాధవ్‌రావు మాట్లాడుతూ.. రైతుబంధు పథకంలో రైతులకు ఎలాంటి సమస్య వచ్చిన హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కళావతి, వైస్ చైర్మన్ మాణిక్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి జాకబ్, తహసీల్దార్ వెంటకయ్య, రైతు సమితి జిల్లా సభ్యుడు అజయ్ ప్రసాద్, మండల కోఆర్డినేటర్ శంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, జీవన్గీ, కాశీంపూర్, దామర్‌చెడ్ సర్పంచులు పద్మమ్మ, కుందేలు గంగమ్మ, సబిత, ఎంపీటీసీలు స్వరూప, అరుణ, రాజేందర్‌రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్లు నర్సిరెడ్డి, కాశీనాథ్, పంతులు, వ్యవసాయ శాఖ ఏడీఏ సచిన్‌దత్, పలువురు రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment