రైతుబంధు పథకంపై అధికార పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరాకు రూ.8వేల చొప్పున ఇస్తుండటంతో తమకు అన్నదాతల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలు ఆశిస్తున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే సాగు ఖర్చుసహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఎంతో అక్కరకు వచ్చిందన్న భావన రైతు వర్గాల్లో నెలకొంది. పైగా చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి రైతుకు వారికున్న భూమిని బట్టి ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడంతో అది ఓటు రూపంలోకి మారి మరింత ప్రయోజనం చేకూరుతుందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే రైతు బీమాతోనూ అనేకమంది లబ్ది పొందుతున్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇస్తుండడం కూడా తమకు లబ్ది చేకూరుస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.
50.91 లక్షల లబ్దిదారులు... కోటి ఓట్లు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. 58.16 లక్షల మంది రైతులకు రూ. 5,737 కోట్లు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం ఏకంగా 58.80 లక్షల చెక్కులను ముద్రించింది. అయితే ఎన్‌ఆర్‌ఐలకు చెక్కులు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడం, చనిపోయిన రైతుల పేర్లు ఉండటం, కొందరు తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల చివరకు గత ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులు ఇచ్చారు. వారికి రూ.5,256 కోట్లు అందజేశారు. అంటే ఒక్కో రైతుకు సరాసరి రూ.10,322 అందాయి. ఇంత పెద్దఎత్తున రైతులకు పెట్టుబడి ఖర్చు కోసం వేలాది కోట్లు ఇవ్వడం దేశంలోనే మొదటిసారి కావడంతో ఈ పథకంపై పెద్దఎత్తున చర్చ జరిగింది. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. 50.91 లక్షల మంది రైతులకు ఇచ్చారంటే, ఆ కుటుంబంలో భార్య, 18 ఏళ్లకు పైబడిన వయసున్న కొడుకును కలిపినా దాదాపు 1.25 కోట్ల మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు రైతుబంధుతో ప్రయోజనం పొందారు.
ఒకవేళ కుమారులు విడిగా రైతుబంధు పథకం కింద లబ్దిపొందారని అనుకున్నా రైతు, ఆయన భార్యతో కలిపినా కోటి మందికిపైగా నేరుగా లబ్దిపొందినట్లే. అంటే రాష్ట్రంలో 2.70 కోట్ల ఓటర్లుంటే, అందులో హైదరాబాద్ ఓటర్లను మినహాయిస్తే 30 జిల్లాల ఓటర్ల సంఖ్య 2.33 కోట్ల మంది. అందులో రైతుబంధు ద్వారా లబ్దిపొందిన వారు కోటి మంది. అంటే ఏకంగా 42 శాతం మంది గ్రామీణ ఓటర్లు రైతుబంధు లబ్దిదారులని తేలింది. గణనీయమైన ఈ ఓట్లు తమకు ఎన్నికల్లో కలిసి వస్తాయని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సమయంలోనూ రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 15 లక్షల మంది రైతులకు రూ.1,700 కోట్లు రైతుబంధు సొమ్మును సర్కారు పంపిణీ చేసింది. ఎన్నికల నాటికి మిగిలిన రైతులందరికీ కూడా రూ.5 వేల కోట్లకు పైగానే సొమ్ము పంపిణీ చేయనుంది. ఇలా నగదు రూపంలో రైతుబంధు సాయం అందుతుండటంతో అది ఎన్నికలపై అనుకూల ప్రభావం చూపుతుందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. రైతుబంధు కింద ఖరీఫ్‌లో లబ్దిపొందిన వారిలో ఐదెకరాలలోపు రైతులే 68 శాతం మంది ఉన్నారు. ఈ రైతుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
రైతుబంధు గొప్ప వరం
రైతుబంధు అమలుతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ పథకం గొప్ప వరం. రానున్న రోజుల్లో రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టాం. ప్రపంచంలో ఇటువంటి పథకం ఎక్కడా లేదు. రైతులకు నగదుఇచ్చి ఆదుకోవడం చిన్న విషయం కాదు. ఒకవైపు సాగునీరు, మరోవైపు నిరంతర విద్యుత్తు, దాంతోపాటు రైతులకు పెట్టుబడి సాయంతో రైతు ఆత్మహత్యలు లేనేలేవు. రైతుల్లో వ్యవసాయంపై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో రైతులంతా టీఆర్‌ఎస్ పార్టీకి మద్ధతు తెలుపుతారనడంలో ఏమాత్రం సందేహంలేదు.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment