బషీరాబాద్, న్యూస్‌లైన్: అక్రమంగా కల్లు విక్రయిస్తున్న వారితో కలిసి ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగారెడ్డి జిల్లా విభాగం అధికారులు మజా చేసుకున్నారు. దామర్‌చెడ్ గ్రామంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నారని గ్రామస్తులు 20 రోజుల క్రితం తాండూరు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దామర్‌చెడ్‌తోపాటు మిగతా గ్రామాలలో దాడులు నిర్వహించేందుకు ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, ఇతర సిబ్బందితో కలిసి మంగళవారం బయలుదేరారు. అయితే తమపై చర్యలు తీసుకోకుండా కల్లు దుకాణాల నిర్వాహకులు ఎత్తుగడ వేశారు.
అధికారులకు చికెన్, మటన్, రోటీలతో బషీరాబాద్ గ్రామ శివారులో చింత చెట్టుకింద విందు ఏర్పాటు చేశారు. ఇంతటి రాచమర్యాదలు కాదనుకోవడం భావ్యం కాదనుకున్నారో ఏమో.. అధికారులు దావత్‌లో పాల్గొని దాడుల విషయం మరిచిపోయారు!. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న విలేకరులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో అక్రమంగా కల్లు విక్రయిస్తున్నారంటూ దామర్‌చెడ్‌లో ఆరుగురిని అరెస్టు చేసి తాండూరు తీసుకెళ్లారు.
దాడులు మరిచారు.. దావతు చేసుకున్నారు!
Published Wed, Feb 5 2014 12:18 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement