ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్ సర్పంచులు
బషీరాబాద్: పంచాయతీలకు కేటాయించిన కేంద్రం, ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచులు మండిపడుతున్నారు. పంచాయతీలకు హక్కుగా వచ్చిన కేంద్ర నిధులను ఇతర పథకాలకు వాడుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన దాదాపు 20 మంది సర్పంచులు ధర్నా చేపట్టారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల (జీపీ) అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో ఎనిమిది నెలలుగా తమకు కేంద్ర నిధులు అందలేదని తెలిపారు. కాగా, గత వారంరోజుల్లో రెండు విడతలుగా కేంద్ర నిధులు జమయ్యాయని స్పష్టంచేశారు. కానీ జమైన నిధులను రాష్ట్రం ప్రభుత్వం ఖాళీ చేసిందని చెప్పారు.
జీపీల కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలకు కేంద్రం నిధులు ఇస్తే.. వాటిని రాష్ట్రం ఎలా వాడుకుంటుందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం నిధులను పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, హరితహారం, అభివృద్ధి పనులకే వినియోగించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎనిమిది నెలలుగా ఎస్‌ఎఫ్‌సీ నిధులు విడుదల చేయలేదని, దీంతో ట్రాక్టర్లలో డీజిల్ పోయలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు.
అప్పులు తెచ్చి పూర్తిచేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని, నెలనెలా వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆర్థిక సంఘం నిధులు జమచేయాలని, లేదంటే బీఆర్‌ఎస్‌కు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు అధికారులు మాత్రం పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేస్తామని సర్పంచులకు సర్ది చెబుతున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సర్పంచులు ప్రియాంక, రవీందర్, భీమప్ప, శాంతిబాయి, విష్ణువర్ధన్‌రెడ్డి, దశరథ్, హన్మీబాయి, నారాయణ, దేవ్‌సింగ్, అనురాధ, గాయత్రి, వీరమణి, వెంకటయ్యతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment