వర్కవుట్ కాలేదని.. వదిలేసిపోయిన దొంగ | stole attempt deccan rural bank | Sakshi
Sakshi News home page

వర్కవుట్ కాలేదని.. వదిలేసిపోయిన దొంగ

Published Thu, Aug 28 2014 12:26 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

stole attempt deccan rural bank

బషీరాబాద్: పెద్దేముల్ మండల కేంద్రంలోని బ్యాంక్‌లో దోపిడీ యత్నం ఘటనను జిల్లా వాసులు మరిచిపోకముందే మళ్లీ అలాంటిదే చోటుచేసుకుంది. ఓ దొంగ బషీరాబాద్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంకులోకి చొరబడి చోరీకి యత్నించాడు. సీసీ కెమెరాలో అతడి కదిలికలు నమోదయయ్యాయి. బుధవారం పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్‌లో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంక్‌ను అధికారులు ఏడాది క్రితం మండల కేంద్రానికి మార్చారు.

బ్యాంక్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న భీంరావుకు చెందిన భవనంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:52 నిమిషాలకు ఓ దొంగ బ్యాంక్ గేటు తాళాలతో పాటు ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అగ్గిపుల్లను వెలిగించిన అతడు స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి పరిశీలించాడు. అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. దీంతో స్ట్రాంగ్ రూం గది తలుపులను తెరిస్తే బర్గ్‌లర్ అలారం మోగుతుందని దొంగ భావించాడేమో.. చోరీ కష్టమనుకున్నాడేమోమరి.. మూడు నిమిషాలపాటు బ్యాంకులో తచ్చాడి.. 1:55 నిమిషాలకు బయటకు వెళ్లిపోయాడు.

బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బ్యాంకు గేట్ తాళాలు పగిలిపోయి ఉండడాన్ని గమనించిన భవన యజమాని భీంరావు మేనేజర్ మల్లికార్జున్‌కు సమాచారం ఇచ్చాడు.  వెంటనే అక్కడికి చేరుకున్న మేనేజర్ పరిస్థితిని గమనించి ఎస్‌ఐ లక్ష్మారెడ్డికి  ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బ్యాంకులో ఎలాంటి చోరీ జరగలేదని మేనేజర్ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఓ దొంగ బ్యాంకులోకి రావడం.. స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి.. మూడు నిమిషాల పాటు బ్యాంకులో గడిపి తిరిగి బయటకు వెళ్లిపోవడం అందులో నిక్షిప్తమయింది. తనొక్కడే చోరీ చేయడం సాధ్యం కాదని దొంగ వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

 క్లూస్ టీంతో ఆధారాల సేకరణ..
 పోలీసులు వికారాబాద్ నుంచి క్లూస్ టీం సిబ్బందిని రప్పించారు. తలుపులు, తాళాలు, బ్యాంకులో క్లూస్ టీం సిబ్బంది వేలు ముద్రలు సేకరించారు. అనంతరం బ్యాంక్ సిబ్బంది నుంచి కూడా వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీ యత్నం జరగడంతో బషీరాబాద్ మండలంలో బుధవారం కలకలం రేగింది. బ్యాంకులో ఎలాంటి దోపిడీ జరగకపోవడంతో ఖాతాదారులు, అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బషీరాబాద్‌లో కొన్ని దుకాణాలు తాళాలను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి విరగ్గొట్టారు. కాగా ఎలాంటి చోరీ కాలేదు. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement