Deccan rural bank
-
ఇక తెలంగాణ గ్రామీణ బ్యాంకు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరు మారింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా (టీజీబీ) మారుస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన జారీ చేసింది. దక్కన్ గ్రామీణ బ్యాంకును టీజీబీగా మారుస్తూ గతేడాది అక్టోబరు 20న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీజీబీలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 15 శాతం, స్పాన్సర్ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు మిగిలిన 35 శాతం వాటా ఉంది. 300లకుపైగా శాఖలతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో బ్యాంకు సేవలందిస్తోంది. -
వ్యవసాయానికి ప్రత్యేక బ్యాంకులు
లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత ప్రతిపాదన సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం సంక్షేమం కోసం, రైతులకు భరోసా కోసం ప్రత్యేకంగా బ్యాంకులు నెలకొల్పాలని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత కేంద్రాన్ని కోరారు.‘ బేటీ పడావో-బేటీ బచావో’ వంటి చక్కటి పథకాలను రూపొందిస్తున్న మోదీ ప్రభుత్వం, రైతులకు భరోసా కల్పించేలా ‘కిసాన్ బచావో’ నినాదాన్ని తీసుకురావాలని కోరారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టంలో సవరణ తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై సోమవారం ఆమె లోక్‌సభలో మాట్లాడారు. ‘చైనా వంటి వ్యవసాయాధారిత దేశాలు రైతుల కోసం, వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేకంగా బ్యాంకులను నెలకొల్పాయి. అలాగే మన దేశంలో కూడా నెలకొల్పాలి.’ అని కోరారు. తెలంగాణలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు ఇతర అనుబంధ వృత్తుల వారికి రుణాలు ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. కేంద్రం తెచ్చిన బిల్లు 1975 నాటి మూలచట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు హరించేలా ఉందన్నారు. -
దోపిడీ దొంగలు దోచుకుపోయారు..
సోమవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు తెగబడ్డారు.. పక్కా వ్యూహంతో బ్యాంకులోకి చొర బడి అందినకాడికి దోచుకుపోయారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లు, అధునాతన పరికరాలు ఉపయోగించి లూటీకి పాల్పడ్డారు. ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని జోడిమెట్ల దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీ ఘటన మంగళవారం జిల్లాలో కలకలం రేపింది. తెల్లవారుజామున బ్యాంకు కిటికీ చువ్వలను వంచి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.32 లక్షల నగదు, తొమ్మిది తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్లతో లాకర్లను ఓపెన్ చేస్తున్న సమయంలో వెలువడిన నిప్పురవ్వల కారణంగా రికార్డులకు మంటలు అంటుకున్నాయి. దీంతో దొంగలు పారిపోయారు. పోలీసులు వివరాలు సేకరించారు. ఘట్కేసర్: దక్కన్ గ్రామీణ బ్యాంకులో దోపిడీకి పాల్పడింది చోరీల్లో ఆరితేరిన ముఠాయేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు బ్యాంకు దోపిడీకి పక్కా ప్రణాళికను అమలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. కాగా ప్రస్తుతానికి బ్యాంకులో రూ.32 లక్షలు, 9 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దోపిడీకి గురైన ఇంకో లాకర్ యజమాని అందుబాటులో లేకపోవడంతో అందులో ఏమేర సొమ్ము చోరీకి గురైందన్న విషయాన్ని పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. బ్యాంకులో పెద్ద ఎత్తున లావాదేవీలు మండలంలోని చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని జోడిమెట్లలో పదేళ్ల క్రితం దక్కన్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేశారు. పోచారంలో ఇన్ఫోసిస్, ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుతో ఇక్కడ రియల్ వ్యాపారం పుంజుకొని ఈ బ్యాంకులో లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రోజూ మాదిరిగానే సోమవారం సాయంత్రం కార్యకలాపాలు ముగిసిన అనంతరం సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 5.30గంటలకు బ్యాంకు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు బ్యాంకు మేనేజర్ శ్రవణ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి బ్యాంకును తెరిచిచూడగా లోపల దట్టంగా పొగ అలుముకుంది. అనుమానంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. తగులబడుతున్న రికార్డులు, ఫైళ్లపై నీరుపోసి పోలీసులు బ్యాంకులోపలికి ప్రవేశించారు. బ్యాంకులో ఉండవలసిన డబ్బు లేకపోవడం, లాకర్లు పగిలి ఉండటం, కిటికీ ఇనుప చువ్వలు వంచి ఉండటంతో బ్యాంకు దోపిడీకి గురైనట్లు పోలీసులు గ్రహించారు. దోపిడీ జరిగింది ఇలా.. మంగళవారం తెల్లవారుజామున దుండగులు బ్యాంకు సమీపంలోని భవనానికి ఎడమ వైపున వాహనాన్ని నిలిపారు. చుట్టు పక్కల ఇళ్లు లేకపోవడంతో వీరిని ఎవరూ గమనించే అవకాశం లేకపోయింది. అనంతరం వాహనాలను పైకి ఎత్తే జాకీ సాయంతో కిటికీ చువ్వలను వంచారు. అందులోనుంచి లోనికి వెళ్లిన దుండగులు వారితో పాటు గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, టార్చి, ఇనుపరాడ్, ఆక్సబ్లేడ్, టైబార్, కారం పొడి పొట్లాలు తీసుకువెళ్లారు. గ్యాస్ కట్టర్ సాయంతో లాకర్‌రూంలోకి చొరబడి అక్కడ ఉన్న క్యాష్ చెస్ట్‌లో ఉన్న రూ.32 లక్షలను తీసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న 70 లాకర్లలో రెండింటిని తెరిచారు. 36వ నంబర్ లాకర్ లో పోచారంకు చెందిన అనంత్‌రెడ్డి దాచిన 9 తులాల బంగారు నగలు దోచుకున్నారు. 27వ నంబర్ చెందిన లాకర్‌ను ధ్వంసం చేశారు. దాని యాజమాని అందుబాటులో లేరు. అనంతరం మరో లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తుండగా నిప్పురవ్వలు పడి అక్కడున్న రికార్డులు అంటుకున్నాయి. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో దుండగులు ఇక అక్కడ ఉండటం మంచిది కాదని భావించి పరారయ్యారు. వెళ్లే సమయంలో సీసీకెమెరాల పుటేజీ హర్డ్డిస్క్ను తీసుకెళ్లారు. గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, టైబార్, కారంపొడి ప్యాకెట్లు, టార్చి, మూడు మంకీక్యాప్లను అక్కడే వదిలారు. బ్యాంకులో చోరీ సంఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. జేసీపీ శివధర్, డీసీపీ రమారాజేశ్వరీ, మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్‌రెడ్డి తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగీలం బ్యాంకులోనికి వెళ్లి పరిసరాల్లో కొంత దూరం వరకు వెళ్లి తిరిగి వచ్చింది. క్లూస్‌టీం, ఎస్ఓటీ, ఎస్బీ, ఐబీ పోలీసులు బ్యాంకులో ఆధారాలను సేకరించారు. ఆందోళనలో ఖాతాదారులు చోరీల్లో ఆరితేరిన ముఠానే దక్కన్ గ్రామీణ బ్యాంకులో దోపిడీకి పాల్పడిందని డీసీపీ రమా రాజేశ్వరి తెలిపారు. సంఘటన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి దొంగతనాలు గతంలో కరీంనగర్, షాద్‌నగర్, వరంగల్‌లో జరిగినట్లు చెప్పారు. దోపిడీకి గ్యాస్‌కట్టర్, గ్యాస్ సిలిండర్, జాకీ తదితర వస్తువులను వాడటాన్ని బట్టి పెద్ద ముఠాయే ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికి రూ.32 లక్షల నగదు, 9తులాల బంగారం బ్యాంకులో దోపిడీకి గురైనట్లు నిర్ధారించామని, దోపిడీకి గురైన సొమ్ము ఇంకా పెరగవచ్చన్నారు. బ్యాంకులో దోపిడీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ లాకర్లు సురక్షితంగా ఉన్నాయో లేవోనన్న ఆందోళన వారిలో కనిపించింది. అయితే రెండు లాకర్లు మాత్రమే చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారులు తెలపడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకు వద్దకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపీపీ బండారి శ్రీనివాస్ వెళ్లి ఖాతాదారులకు ధైర్యం చెప్పారు. -
బ్యాంకుల వద్ద బారులు
రుణమాఫీ పొంది కొ త్త రుణాల కోసం రైతులు పహణీలు సమర్పించేందుకు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఉద యం నుంచి రాత్రి వరకూ క్యూలో నిల్చుంటున్నారు. వేమనపల్లి/చెన్నూర్ : రుణాల కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల తెరువకముందే బ్యాంకుల ఎదుట బారులు తీరాల్సి వస్తోంది. మంగళవారం వేమనపల్లి, చెన్నూర్ పట్టణాల్లోని డెక్కన్ గ్రామీణ బ్యాంకులకు రైతులు వెల్లువలా భారీగా తరలివచ్చారు. వేమనపల్లి బ్యాంకు వద్దకు 25 గ్రామాలకు చెందిన సుమారు 1100 మంది రైతులు తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట నెలకొంది. ఇద్దరు రైతులు అస్వస్థతకు గురయ్యారు. చెన్నూర్‌లోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్ వద్ద బ్యాంక్ తెరవకముందే పెద్ద సంఖ్యలో రైతులు వచ్చా రు. మధ్యాహ్నం రైతులు వరుసక్రమాన్ని విస్మరించడంతో తోపులాట జరిగింది. ఇందులో ఆస్నాద గ్రామానికి చెందిన ఇరుగండి భూదేవి అనే మహిళ రైతుకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవీందర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
‘బ్యాంకు’ తీరును నిరసిస్తూ ఆందోళన
ఆసిఫాబాద్‌లో రైతుల రాస్తారోకో ఆసిఫాబాద్: బ్యాంకు అధికారు ల వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఒక్కో రైతుకు రూ.లక్ష పంట రుణాల మాఫీ చేసింది. కొత్త రుణాల కోసం అవసము న్న డాక్యుమెంట్లను జత చేసి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటిం చింది. దీంతో రెండు రోజులుగా రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా పహణీలు తీసుకొని స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంకులో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చా రు. ఈ బ్యాంకులో 3,200 మంది రైతుల డాక్యుమెంట్లను కంప్యూటర్లో పొం దుపరచాల్సి ఉంది. మంగళవారం గడువు ముగుస్తుండడంతో వందలాది మం ది రైతులు బ్యాంకుకు వచ్చారు. అయితే స్థలాభావంతో సిబ్బంది ప్రధాన గేటు ను మూసివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు రహదారిపై బైఠాయించారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేశారు. తమ దరఖాస్తులు తీసుకొని వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వ్యవసాయ మార్కె ట్ కార్యాలయాల వద్ద గ్రామ పంచాయతీల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరకాస్తులు స్వీకరిస్తామని ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై రాంబాబులు చెప్పడంతో రైతులు శాంతించారు. -
ఉద్యోగాలు
దక్కన్ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంక్ (డీజీబీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - ఆఫీసర్ (స్కేల్ -3): 4 - జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (స్కేల్ -2): 13 - అగ్రికల్చరల్ ఆఫీసర్: 2 - ఐటీ ఆఫీసర్: 4 - లా ఆఫీసర్: 1 - ట్రెజరీ మేనేజర్: 1 - మార్కెటింగ్ ఆఫీసర్: 1 అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం అవసరం. ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్-2013 అర్హత ఉండాలి. - ఆఫీసర్ (స్కేల్-1): 61 - ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 111 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్-2013 అర్హత సాధించాలి. వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: సెప్టెంబర్ 19 వెబ్సైట్: http://www.dgbhyd.com/ సీ-డాక్, హైదరాబాద్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - ప్రాజెక్టు ఆఫీసర్: 2 అర్హతలు: మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం/ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం అవసరం. - ప్రాజెక్ట్ సర్వీస్ సపోర్ట్: 1 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం. కనీసం ఐదేళ్ల అనుభవం అవసరం. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: సెప్టెంబర్ 12 వెబ్సైట్: http://www.cdac.in/ -
వర్కవుట్ కాలేదని.. వదిలేసిపోయిన దొంగ
బషీరాబాద్: పెద్దేముల్ మండల కేంద్రంలోని బ్యాంక్‌లో దోపిడీ యత్నం ఘటనను జిల్లా వాసులు మరిచిపోకముందే మళ్లీ అలాంటిదే చోటుచేసుకుంది. ఓ దొంగ బషీరాబాద్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంకులోకి చొరబడి చోరీకి యత్నించాడు. సీసీ కెమెరాలో అతడి కదిలికలు నమోదయయ్యాయి. బుధవారం పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్‌లో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంక్‌ను అధికారులు ఏడాది క్రితం మండల కేంద్రానికి మార్చారు. బ్యాంక్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న భీంరావుకు చెందిన భవనంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:52 నిమిషాలకు ఓ దొంగ బ్యాంక్ గేటు తాళాలతో పాటు ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అగ్గిపుల్లను వెలిగించిన అతడు స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి పరిశీలించాడు. అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. దీంతో స్ట్రాంగ్ రూం గది తలుపులను తెరిస్తే బర్గ్లర్ అలారం మోగుతుందని దొంగ భావించాడేమో.. చోరీ కష్టమనుకున్నాడేమోమరి.. మూడు నిమిషాలపాటు బ్యాంకులో తచ్చాడి.. 1:55 నిమిషాలకు బయటకు వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బ్యాంకు గేట్ తాళాలు పగిలిపోయి ఉండడాన్ని గమనించిన భవన యజమాని భీంరావు మేనేజర్ మల్లికార్జున్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మేనేజర్ పరిస్థితిని గమనించి ఎస్ఐ లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బ్యాంకులో ఎలాంటి చోరీ జరగలేదని మేనేజర్ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఓ దొంగ బ్యాంకులోకి రావడం.. స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి.. మూడు నిమిషాల పాటు బ్యాంకులో గడిపి తిరిగి బయటకు వెళ్లిపోవడం అందులో నిక్షిప్తమయింది. తనొక్కడే చోరీ చేయడం సాధ్యం కాదని దొంగ వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ.. పోలీసులు వికారాబాద్ నుంచి క్లూస్ టీం సిబ్బందిని రప్పించారు. తలుపులు, తాళాలు, బ్యాంకులో క్లూస్ టీం సిబ్బంది వేలు ముద్రలు సేకరించారు. అనంతరం బ్యాంక్ సిబ్బంది నుంచి కూడా వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీ యత్నం జరగడంతో బషీరాబాద్ మండలంలో బుధవారం కలకలం రేగింది. బ్యాంకులో ఎలాంటి దోపిడీ జరగకపోవడంతో ఖాతాదారులు, అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బషీరాబాద్‌లో కొన్ని దుకాణాలు తాళాలను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి విరగ్గొట్టారు. కాగా ఎలాంటి చోరీ కాలేదు. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.