వ్యవసాయానికి ప్రత్యేక బ్యాంకులు
లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత ప్రతిపాదన
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం సంక్షేమం కోసం, రైతులకు భరోసా కోసం ప్రత్యేకంగా బ్యాంకులు నెలకొల్పాలని టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత కేంద్రాన్ని కోరారు.‘ బేటీ పడావో-బేటీ బచావో’ వంటి చక్కటి పథకాలను రూపొందిస్తున్న మోదీ ప్రభుత్వం, రైతులకు భరోసా కల్పించేలా ‘కిసాన్ బచావో’ నినాదాన్ని తీసుకురావాలని కోరారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టంలో సవరణ తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై సోమవారం ఆమె లోక్‌సభలో మాట్లాడారు.
‘చైనా వంటి వ్యవసాయాధారిత దేశాలు రైతుల కోసం, వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేకంగా బ్యాంకులను నెలకొల్పాయి. అలాగే మన దేశంలో కూడా నెలకొల్పాలి.’ అని కోరారు. తెలంగాణలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు ఇతర అనుబంధ వృత్తుల వారికి రుణాలు ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. కేంద్రం తెచ్చిన బిల్లు 1975 నాటి మూలచట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు హరించేలా ఉందన్నారు.