k. kavitha
-
‘కారు’ స్పీడ్ ఆగొద్దు..!
సాక్షి, కోరుట్ల: ‘టీఆర్ఎస్ మీ ఇంటి పార్టీ..కోరుట్ల నాకు సెంటిమెంట్ ఊరు..మరోసారి ఆశీర్వదించండి..నిరంతరం అభివృద్ధికి పాటుపడతానని’..నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట కవిత అన్నారు. బుధవారం కోరుట్లలోని పీబీ గార్డెన్స్‌లో టీఆర్ఎస్లో మున్నురు కాపు సంఘాల చేరిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మున్నురు కాపు సంఘాలతో పాటు బీడీ టేకేదార్లు టీఆర్ఎస్కు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఎంపీగా మొదటిసారి గెలిచిన తర్వాత మొట్టమొదటగా కోరుట్లలో ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి రూ.36లక్షలు కేటాయించానని, అప్పటి నుంచి నిజామాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి పనులు చకచకా సాగాయన్నారు. కోరుట్ల ప్రజల ఆకాంక్షల మేరకు రెవెన్యూ డివిజన్, వంద పడకల ఆసుపత్రి, 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేలైన్ పూర్తి చేయించి కోరుట్లకు రైలు తెప్పించామన్నారు. తిరుపతి, ముంబాయ్ రైళ్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయన్నారు. కోరుట్లలో ముంబాయ్ రైలు ఆగేలా ఇప్పటికే చర్యలు చేపట్టామని, కోరుట్ల మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం ఎన్నడూ లేని రీతిలో రూ. 50 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు. మళ్లీ తనను గెలిపిస్తే..రానున్న కాలంలో కోరుట్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న టీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే మనకు ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయన్నారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘాలు, జెడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ, ఆర్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ గడ్డమీది పవన్, పట్టణ, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశ్, నాయకులు యాటం చిట్టి, జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీనారాయణ, గుడ్ల మనోహర్, సంగ లింగం, సేనాపతి రాజు, ఆడెపు మధు పాల్గొన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలి కోరుట్లరూరల్: రాష్ట్రంలో పేదప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని ఎంపీ కవిత అన్నారు. మండలంలోని అయిలాపూర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలోని పేదలకు డబుల్ బెడ్రూం నిర్మిస్తామని, మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు ఇళ్లు లేవని దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఎవరికీ ఉండదన్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 5లక్షలు ఇస్తామన్నారు. మన రాష్ట్రం నుంచి 16 మందిని లోక్‌సభకు పంపిస్తే మనకు రావలసిన నిధులు బాజాప్త తెచ్చుకోవచ్చని, కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసేదేమీ లేదని, బీజేపీ అంటే భారతీయ జూట్ పార్టీ అని, దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మె పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24గంటల విద్యుత్ అందిస్తున్నామని, రైతుబంధు, రైతుబీమా పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పిడుగు రాధ సందయ్య, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎంపీపీ టి.భారతి, మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికులకు సీఎం వరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు వరాల జల్లు కురిపించారు. సింగరేణి కార్మికుల లాభాల వాటాను ప్రతీ ఏటా పెంచుతూ వస్తున్న సీఎం కేసీఆర్.. ఈ ఏడాది కూడా వారికి శుభవార్త చెప్పారు. 2017-18సంవత్సరానికి గాను కార్మికులకు 2 శాతం లాభాల వాటాను పెంచారు. దీంతో గత ఏడాది 25శాతం లాభాల వాటా అందుకున్న కార్మికులు.. ఈ ఏడాది 27 శాతం వాటా అందుకోబోతున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకెఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత నేతృత్వంలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, టీబీజీకేఎస్ నాయకులు ప్రగతి భవన్ లో సీఎంతో సుమారు 45 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్మికుల లాభాల వాటా పెంచినందుకు సీఎంకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ప్రకటించిన లాభాల వాటాను ఏయే తేదీల్లో కార్మికుల ఖాతాల్లో డిపాజిట్ చేయబోతున్నారన్న దానికి సంబంధించి స్పష్టమైన వివరాలేవి వెల్లడి కాలేదు. సీఎం నుంచి సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు ఆదేశాలు జారీ అయిన వెంటనే ఆ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే డిపెండెంట్ ఉద్యోగాలకు బదులు సింగరేణిలో కారుణ్య నియామకాలు కొనసాగుతున్నాయి. మెడికల్ అన్‌ఫిట్ అయ్యే కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఈటల రాజేందర్, ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ కవిత చలో జగిత్యాల.!
సాక్షి, జగిత్యాల: సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డిని అధికార టీఆర్ఎస్ టార్గెట్ చేసిందా? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహం సిద్ధం చేస్తోందా? అసెంబ్లీ పోరులో జీవన్‌రెడ్డిని ఢీకొట్టేందుకు నిజామాబాద్ ఎంపీ కవితను బరిలోకి దింపబోతోందా? ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! ఎంపీ కవిత జగిత్యాల నియోజకవర్గంపై దృష్టి సారించడం, విస్తృతంగా పర్యటించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయడం, అభివృద్ధి పనులు ఊపందుకోవడం, హైదరాబాద్ తర్వాత ఈ మున్సిపాలిటీకే ప్రత్యేక కోటా కింద నూకపల్లిలో 4,160 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయడం తదితర కార్యక్రమాలు చూస్తుంటే కవిత ఇక్కడ్నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. నూకపల్లి అర్బన్ కాలనీని దత్తత తీసుకుని మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని కవిత ఇటీవల స్వయంగా ప్రకటించారు. నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటివరకు జగిత్యాలలో ఆమె సుమారు 30 సార్లు పర్యటించారు. బహుముఖ వ్యూహమా? జగిత్యాలపై సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మార్కు స్పష్టంగా కన్పిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్‌ల్లో నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. సీఎల్పీ ఉపనేతగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై గళమెత్తుతున్నారు. ఆయన్ను ఢీ కొట్టాలంటే అదే స్థాయి నాయకుడు కావాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. కవిత ఇక్కడ్నుంచి పోటీ చేస్తే.. ఆయనకు గట్టి పోటీ ఇచ్చినట్టవుతుందని, అలాగే పార్టీలో నెలకొన్న వర్గపోరుకు తెరపడుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగిత్యాలలో టీఆర్ఎస్ మూడు వర్గాలుగా ఏర్పడింది. నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, పెగడపల్లి సింగిల్ విండో చైర్మన్ ఓరుగంటి రమణారావు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావుల వారీగా పార్టీ కేడర్ విడిపోయింది. పార్టీ తరఫున ఏ పిలుపు ఇచ్చినా.. మూడు వర్గాలు కార్యక్రమాలు నిర్వహించడం ఆ పార్టీ శ్రేణుల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అధిష్టానం కూడా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కవితను బరిలోకి దింపితే ఈ వర్గపోరుకు కూడా ఫుల్స్టాప్ పడుతుందని అధినాయకత్వం భావిస్తోంది. అలాగే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీని నమ్ముకుని పని చేస్తున్న నాయకులకు నామినేటెడ్ పదవులు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన గొడిసెల రాజేశం గౌడ్‌కు ఆర్థిక సంఘం చైర్మన్‌గా, బీఎస్ రాములకు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా నామినేటెడ్ పదవులు వరించాయి. వారిద్దరూ బీసీ వర్గానికే చెందిన వారే కావడం.. నియోజకవర్గంలో 60 శాతం ఓట్లు బీసీలవే కావడంతో ఎన్నికల్లో వారి ఓట్లూ తమకే దక్కుతాయని టీఆర్ఎస్ భావిస్తోంది. -
మోదీని కావాలని అవమానించలేదు
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై సీఎం కేసీఆర్ భావోద్వేగంగా మాట్లాడిన సందర్భంలో దొర్లిన తప్పిదమే తప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించాలనే సంకుచిత ఉద్దేశం లేదని ఎంపీ కె.కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సన్ ఫౌండేషన్ చైర్పర్సన్ కావేరి శుక్రవారం ఇక్కడ కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో కవిత మాట్లాడుతూ ప్రధానిని అవమానిస్తే దేశంలోని ప్రజలంతా ఎవరికివారే అవమానించుకున్నట్టు అని అన్నారు. చిన్న పొరపాటుపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దేశంలో 130 కోట్ల మంది ఉంటే 600 మంది ఓట్లేసి తనను గెలిపించినట్టుగా దావోస్ పర్యటనలో మోదీ తప్పుగా మాట్లాడలేదా అని ప్రశ్నించారు. రైతుల కష్టాల పట్ల ఆవేదనతోనే సీఎం కొంచెం కటువుగా మాట్లాడారని చెప్పారు. రైతు బడ్జెట్ అని చెప్పిన కేంద్రం రైతులకు కేటాయించిందేమీ లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతునిస్తూనే ఉన్నామని, విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని అన్నారు. వ్యాపార రంగానికి సంబంధించి 30 బిల్లులు పెట్టిన కేంద్రం రైతుల కోసం ఒక్క బిల్లు కూడా పెట్టలేదని విమర్శించారు. రైతుల హక్కులు, నిధుల కోసం పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతామన్నారు. -
వ్యవసాయానికి ప్రత్యేక బ్యాంకులు
లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత ప్రతిపాదన సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం సంక్షేమం కోసం, రైతులకు భరోసా కోసం ప్రత్యేకంగా బ్యాంకులు నెలకొల్పాలని టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత కేంద్రాన్ని కోరారు.‘ బేటీ పడావో-బేటీ బచావో’ వంటి చక్కటి పథకాలను రూపొందిస్తున్న మోదీ ప్రభుత్వం, రైతులకు భరోసా కల్పించేలా ‘కిసాన్ బచావో’ నినాదాన్ని తీసుకురావాలని కోరారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టంలో సవరణ తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై సోమవారం ఆమె లోక్‌సభలో మాట్లాడారు. ‘చైనా వంటి వ్యవసాయాధారిత దేశాలు రైతుల కోసం, వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేకంగా బ్యాంకులను నెలకొల్పాయి. అలాగే మన దేశంలో కూడా నెలకొల్పాలి.’ అని కోరారు. తెలంగాణలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు ఇతర అనుబంధ వృత్తుల వారికి రుణాలు ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. కేంద్రం తెచ్చిన బిల్లు 1975 నాటి మూలచట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు హరించేలా ఉందన్నారు. -
'పవన్ కళ్యాణ్‌కి ఇప్పటికే దిమ్మ తిరిగింది'
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ కె. కవిత అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో కవిత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ఎన్ని రూపాయిలు ఇచ్చి బీజేపీ టిక్కెట్ కొనుకున్నాడో వెల్లడించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. అదికాక జగ్గారెడ్డి తరఫున కిషన్ రెడ్డి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. మాపై విమర్శలు చేస్తే సహించేది లేదని బీజేపీ, టీడీపీలను కవిత హెచ్చరించారు. టీడీపీ, బీజేపీల గెలువడం అనైతికమైనదని ఆమె అభివర్ణించారు. ఇప్పటికే ఆ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కాదు.... తెలంగాణ ప్రభుత్వ విధానాలే మెదక్ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో గవర్నర్ గిరికి వ్యతిరేకంగా పోరాడిన ఘనత తమదేనని కవిత వెల్లడించారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు దిమ్మదిరిగే ఫలితాలు ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు కవిత సమాధానం చెబుతూ... తెలంగాణలో ఆయన ప్రచారం చేసిన వచ్చిన సీట్లు ఎన్నో ఆయా పార్టీలకే తెలియాలి. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఆయనకు ఇప్పటికే దిమ్మదిరిగిందని కవిత తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా టీడీపీని పట్టంచుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. -
మట్టిలో మాణిక్యం పూర్ణ
గ్రామీణ గిరిజన కుటుంబంలో పుట్టి.. గురుకుల పాఠశాలలో చదివి.. ఎవరికీ అందనంత ఎత్తున్న ఎవరెస్టును ఎక్కింది. జిల్లా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. అసాధ్యాన్ని సైతం.. నిండైన ఆత్మవిశ్వాసంతో సుసాధ్యం చేసింది మన ఇందూరు బిడ్డ మాలావత్ పూర్ణ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి వచ్చిన పూర్ణకు జిల్లా ఘనస్వాగతం పలికింది. పాకాల(సిరికొండ): ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ మట్టిలో మాణిక్యమని తెలంగాణ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ రిక్క లింబాద్రి అన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అనంతరం పూర్ణ తొలిసారిగా స్వగ్రామమైన పాకాలకు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో లింబాద్రి మాట్లాడారు. ఒక సాధారణ గిరిజన బాలిక ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆణిముత్యం గా నిలిచిందన్నారు. పూర్ణ, ఆనంద్‌లను ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపిక చేసి పంపిస్తున్నప్పు డు ఎంతోమంది ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఏవేవో అన్నారని, వారికేమైనా జరిగితే పంజాగుట్ట చౌరస్తాలో నన్ను ఉరి తీస్తారని మాట్లాడారని ప్రవీణ్‌కుమార్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. అనంతరం సన్మాన గ్రహీత పూర్ణ మాట్లాడుతూ ఎవరెస్ట్ అధిరోహణ కోసం ప్రయాణం ప్రారంభించిన రోజు మా శిక్ష కులు ఎవరెస్ట్ అధిరోహణ ఎంత కఠినతరమైందో మా తల్లిదండ్రులకు వివరించారన్నారు. అప్పుడు మా నాన్న కష్టపడితేనే కదా సార్ ఫలితం వచ్చేది అని చెప్పగానే నాకెంతో ఆనందం వేసిందని పూర్ణ గుర్తు చేశారు. డెత్ జోన్లో రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఎక్కుతున్నప్పుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాల వెలుగును ఎంతో ఆస్వాదించానన్నారు. మా గ్రామం పాకాల పేరును ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని పూర్ణ తెలిపారు. ఐపీఎస్ ఆర్.ప్రవీణ్‌కుమార్, శిక్షకులు శేఖర్‌బాబు, పరమేష్‌కుమార్, వేణుగోపాలచారికి ఈసందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, పూర్ణ తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సన్మానం పూర్ణను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా స న్మానించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎ. సాయిలు పూర్ణకు శాలువా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం పూర్ణతోపాటు ఆమె తల్లిదండ్రులకు సన్మానం చేసి నూతన వస్త్రాలను బహుకరించారు. కార్యక్రమంలో యూని యన్ నాయకులు గంగాదాసు, పాకాల నర్సిం లు, జిల్లా బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షుడు శశాంక్ తదితరులు ఉన్నారు. అధికారికంగా పూర్ణకు సత్కారం నిజామాబాద్ ఎంపీ కె. కవిత కలెక్టరేట్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశ ఖ్యాతిని మరింత పెంచిన మాలావత్ పూర్ణను త్వరలో అధికారికంగా సన్మానించనున్నట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె తన స్వగృహంలో మాట్లాడారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అతిచిన్న వయస్సులో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా అధిరోహించిన పూర్ణను అభినందిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. పూర్ణను త్వరలో జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున సన్మానిస్తామని వివరించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సిరికొండ మండలం పాకాల గ్రామంలో భార త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూర్ణ ఆవిష్కరించారు. జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నారాయణ విగ్రహాన్ని వితరణగా అందించారు. గ్రామాని కి చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు గద్దె నిర్మించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలయ్య, సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సోసైటీ చైర్మన్ నర్సయ్య, పాల్గొన్నారు. భీమ్‌గల్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలోకెక్కిన జిల్లా వాసి మాలావత్ పూర్ణను ఆదివారం భీమ్‌గల్ జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ శర్మన్ ఆధ్వర్యంలో సన్మానించారు. పూర్ణ స్వగ్రామమైన పాకాలకు వచ్చిన పూర్ణకు శాలువా పూల మాలలు వేసి మెమెంటోతో సన్మానించారు. ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు శర్మన్ నాయక్, రాజేశ్వర్, లింబాద్రి తదితరులున్నారు. -
నాడు ఒడ్డున కూర్చుని..నేడు ఓట్లడుగుతారా?
కాంగ్రెస్ నేతలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్న డిచ్పల్లి/జక్రాన్‌పల్లి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒడ్డున కూర్చున్నవారికి ఓటు వేస్తారో, పోరాడిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత ప్రజలను కోరారు. తెలంగాణ వికాసం టీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యమం కొనసాగినప్పుడు ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు నేడు తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అప్పనంగా ఎవరి చేతిలోనే పెట్టడం సమంజసం కాదన్నారు.‘మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం’ అని ఆమె పిలుపునిచ్చారు.