నిజామాబాద్ ఎంపీ కవిత
సాక్షి, జగిత్యాల: సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డిని అధికార టీఆర్‌ఎస్ టార్గెట్ చేసిందా? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహం సిద్ధం చేస్తోందా? అసెంబ్లీ పోరులో జీవన్‌రెడ్డిని ఢీకొట్టేందుకు నిజామాబాద్ ఎంపీ కవితను బరిలోకి దింపబోతోందా? ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! ఎంపీ కవిత జగిత్యాల నియోజకవర్గంపై దృష్టి సారించడం, విస్తృతంగా పర్యటించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయడం, అభివృద్ధి పనులు ఊపందుకోవడం, హైదరాబాద్ తర్వాత ఈ మున్సిపాలిటీకే ప్రత్యేక కోటా కింద నూకపల్లిలో 4,160 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయడం తదితర కార్యక్రమాలు చూస్తుంటే కవిత ఇక్కడ్నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. నూకపల్లి అర్బన్ కాలనీని దత్తత తీసుకుని మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని కవిత ఇటీవల స్వయంగా ప్రకటించారు. నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటివరకు జగిత్యాలలో ఆమె సుమారు 30 సార్లు పర్యటించారు.
బహుముఖ వ్యూహమా?
జగిత్యాలపై సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మార్కు స్పష్టంగా కన్పిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్‌ల్లో నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. సీఎల్పీ ఉపనేతగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై గళమెత్తుతున్నారు. ఆయన్ను ఢీ కొట్టాలంటే అదే స్థాయి నాయకుడు కావాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. కవిత ఇక్కడ్నుంచి పోటీ చేస్తే.. ఆయనకు గట్టి పోటీ ఇచ్చినట్టవుతుందని, అలాగే పార్టీలో నెలకొన్న వర్గపోరుకు తెరపడుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగిత్యాలలో టీఆర్‌ఎస్ మూడు వర్గాలుగా ఏర్పడింది. నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, పెగడపల్లి సింగిల్ విండో చైర్మన్ ఓరుగంటి రమణారావు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావుల వారీగా పార్టీ కేడర్ విడిపోయింది. పార్టీ తరఫున ఏ పిలుపు ఇచ్చినా.. మూడు వర్గాలు కార్యక్రమాలు నిర్వహించడం ఆ పార్టీ శ్రేణుల్లోనే చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంపై అధిష్టానం కూడా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కవితను బరిలోకి దింపితే ఈ వర్గపోరుకు కూడా ఫుల్‌స్టాప్ పడుతుందని అధినాయకత్వం భావిస్తోంది. అలాగే టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీని నమ్ముకుని పని చేస్తున్న నాయకులకు నామినేటెడ్ పదవులు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన గొడిసెల రాజేశం గౌడ్‌కు ఆర్థిక సంఘం చైర్మన్‌గా, బీఎస్ రాములకు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా నామినేటెడ్ పదవులు వరించాయి. వారిద్దరూ బీసీ వర్గానికే చెందిన వారే కావడం.. నియోజకవర్గంలో 60 శాతం ఓట్లు బీసీలవే కావడంతో ఎన్నికల్లో వారి ఓట్లూ తమకే దక్కుతాయని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment