నీళ్లపల్లిలో కుప్పలుగా పడి ఉన్న పాములు
బషీరాబాద్(తాండూరు) : ఇంటి గుమ్మం పక్కన బండ కింద ఏకంగా 300 పాములు బయటపడ్డాయి. గమనించిన ఇంటి యజమాని గ్రామస్తుల సహాయంతో వాటిని కొట్టి చంపారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నీళ్లపల్లి (జలాల్‌పూర్) గ్రామంలో శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన చాకలి మొగులప్ప అనే రైతు ఇంటి ముందు కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ఓ పాము పిల్ల బండ కింద నుంచి బయటకు వచ్చింది.
గమనించిన రైతు ఆ పామును కట్టెతో కొట్టి చంపాడు. మరికొద్ది సమయానికి ఒక్కొక్కటిగా పదుల సంఖ్యలో పాములు బయటకు రావడాన్ని గమనించి ఉలిక్కిపడ్డాడు. విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో నిమిషాల్లో ఇంటి ముందు జనం గుమిగూడారు. కట్టెలతో కొడుతూ వాటిని చంపారు. అనంతరం గుమ్మం చుట్టూ పరిచి ఉన్న నాపరాయి బండలను తొలగించడంతో కుప్పల కుప్పలుగా పాము పిల్లలు బయటకొచ్చాయి. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు.
సుమారు 300 పాములు, పాము గుడ్లు బయట పడ్డాయి. వాటన్నింటినీ ఒక దగ్గర వేసి కిరోసిన్ పోసి నిప్పింటించారు. ఇప్పటి వరకు తాము ఇంత పెద్ద మొత్తంలో పాములను చూడలేదని ఇంటి యజమాని మొగులప్ప తెలిపారు. విష సర్పాలు అయినందుకే గ్రామస్తులతో కలిసి చంపామని వివరించారు. బయట పడిన పాములు చాలా విషపూరితమైనవిగా గ్రామస్తులు తెలిపారు. అయితే గుడ్లు పెట్టిన తల్లి పాము జాడ మాత్రం కనిపించలేదని చెబుతున్నారు. సంఘటనపై వన్యప్రాణుల అధికారులు పరిశీలన జరిపి గ్రామస్తుల అనుమానాలను తొలగించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment