తాండూరు, న్యూస్‌లైన్ : విద్యాశాఖ ఉదాసీన వైఖరితో మధ్యాహ్న భోజన పథకం వంటగదుల నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. దాదాపు రెండేళ్లుగా వంటగదుల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పథకం కింద పాఠశాల్లో వంటలు చేయడానికి ప్రత్యేకంగా గదులు నిర్మించేందుకు సుమారు రెండేళ్ల క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల్లోని పాఠశాలల్లో మొత్తం 99 వంటగదులు నిర్మించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు నాలుగు మండలాల్లో 31 వంటగదుల నిర్మాణాలు జరిగాయి. ఇంకా 68 వంటగదుల నిర్మాణాలకు పునాది కూడా పడలేదు. పాఠశాల కమిటీ తీర్మానం మేరకు వంట గదుల నిర్మాణాలు చేపట్టాలి. ఒక్కొక్క గది నిర్మాణానికి రూ.75వేలచొప్పున నిధులు మంజూరు అయ్యాయి.
విద్యాశాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో ఈ పనులు జరగాల్సి ఉంది. అయితే నిధులు మురుగుతున్నా వంటగదుల నిర్మాణాలకు మాత్రం మోక్షం కలగటం లేదు. దీంతో ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీలు పాఠశాలల ఆవరణలో, చెట్ల కిందనో వంటలు చేయాల్సి వస్తోంది. విద్యాశాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చొరవ చూపకపోవడంతో వంటగదుల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దాంతో రూ.51లక్షల నిధులు పంచాయతీరాజ్ శాఖ వద్ద మురుగుతున్నా పనులను చేయించడంలో సంబంధిత ఉన్నతాధికారులకు పట్టింపు లేకుండా పోయిందని స్పష్టమవుతోంది. అయితే మంజూరు చేసిన రూ.75వేల నిధులు వంటగదుల నిర్మాణానికి సరిపోవనే కారణంతో ఈ పనులు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో మండల పరిషత్ లేదా పంచాయతీల నుంచి ఒక్కొక్క గదికి అదనంగా రూ.25వేల నిధులు సమకూర్చుకోవాలని గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే ఈ మేరకు అదనపు నిధులు ఇవ్వడానికి మండల పరిషత్, పంచాయతీలు విముఖత చూపాయి.
దాంతో నిర్మాణాలకు మోక్షం కలగటం లేదని తెలుస్తోంది. బషీరాబాద్‌లో 31వంట గదులకు 13 నిర్మించారు. పెద్దేముల్‌లో 19కిగాను 5, తాండూరులో 26కిగాను 6, యాలాల మండలంలో 23వంటగదులకు గాను 7 మాత్రమే నిర్మించారు. వంటగదుల నిర్మాణాలు చేపట్టాలని పాఠశాల కమిటీలకు చాలాసార్లు చెప్పామని తాండూరు మండల విద్యాధికారి శివకుమార్ ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు. కాగా, నిధులు సరిపోవనే కారణంతోనే ఈ పనులు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని పీఆర్ తాండూరు డీఈ తిరుపతయ్య చెప్పారు. రూ.75వేలతో పలు పాఠశాలల ప్రహారీలను కలుపుతూ కొన్ని వంట గదులు నిర్మాణాలు పూర్తి చేయించామని డీఈ వివరించారు.
రెండేళ్లుగా వంటగదులకు వీడని గ్రహణం
Published Fri, Nov 8 2013 12:07 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM
Advertisement