గాంధీజీ మార్గంలో పయనించాలి
Published Thu, Oct 3 2013 4:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
పల్లెపాడు(ఇందుకూరుపేట), న్యూస్‌లైన్: జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని జేసీ లక్ష్మీకాంతం అన్నారు. మండలంలోని పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో గాంధీజీ 143 జయం తి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. జేసీ మాట్లాడుతూ మనిషి తన జీవితంలో ఏం చదివాం, ఎంత సంపాదించాం అనే దానికంటే సమాజానికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యమన్నారు. గాంధీ ఆశ్రమాన్ని జిల్లాలో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, గాంధేయ వాది వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం గాంధీజీ అని కొనియాడారు. ప్రజలతో గాంధీజీ మమేకమై సాధారణ జీవితాన్ని గడుపుతూ దేశానికి సేవ చేశారన్నారు.
మనిషి ఉన్నతంగా ఆలోచించి తనకు ఎంత వరకు అవసరమో అంత వరకే తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను కొనసాగించాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆశ్రమ అభివృద్ధికి తన వంతుగా ఐదు లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనతరం క్విజ్,చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆశ్రమంలో రక్తదాన శిబిరం నిర్వహిచారు. అన్నదాన కార్యక్రమం జరిగింది. డాక్టర్ సీవీరెడ్డి, ఇందిర దంపతులు అన్నదానానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, ఆశ్రమ కన్వీనర్ గణేశం కృష్ణారెడ్డి, సభ్యులు నెల్లూరు రవీంద్రరెడ్డి, నేదురుమల్లి సుబ్బారెడ్డి, సీహెచ్ నారాయణ, కె పోలయ్య, బి భాస్కర్, పోలయ్య, గాంధీజీ సిద్ధాంత ప్రచార కమిటీ అధ్యక్షుడు శివరామయ్య, మహిళా అధ్యక్షురాలు గూడూరు లక్ష్మి, ఏవీ సుబ్రహ్మణ్యం,సర్పంచ్ గూడూరు జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement