సాక్షి, అమరావతి: వచ్చే నెల నుంచి మామిడి మార్కెట్‌లోకి రాబోతుంది. గడిచిన రెండేళ్లు మామిడి మార్కెట్‌ను కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. దేశీయ మార్కెట్లకు తరలించే విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహం మామిడి రైతుకు కొంతమేర ఉపశమనం కలిగించింది. ఈసారి కరోనా ప్రభావం లేకపోవడంతో కాస్త మంచి రేటు వస్తుందన్న ఆశాభావంతో ఉన్న రైతులకు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విమాన రాకపోకలపై యూరప్ దేశాలు విధిస్తోన్న ఆంక్షలు కలవరపెడుతున్నాయి. మామిడి పూర్తి స్థాయిలో మార్కెట్‌కు వచ్చే సమయానికి పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావంతో వారున్నారు.
3.35లక్షల హెక్టార్లలో..
రాష్ట్రంలో ఈ ఏడాది 3.35లక్షల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. గతేడాది చివర్లో కురిసిన వర్షాల ప్రభావంతో ఈసారి పూత కాస్త ఆలస్యమైంది. ప్రారంభంలో పూతపై అక్కడక్కడ కన్పించిన నల్ల తామర పురుగు (త్రిప్స్ పార్విస్ పైనస్) ప్రభావం ప్రస్తుతం ఎక్కడా కన్పించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హెక్టార్‌కు 12 టన్నుల చొప్పున 40.26లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. ఆర్‌బీకేల కేంద్రంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ తోట బడులతో పాటు ఫ్రూట్‌కేర్ విధానాల వల్ల దిగుబడుల్లో నాణ్యత పెరుగుతోంది. ఎగుమతులకు ప్రామాణికమైన “ఫైటో శానిటరీ సర్టిఫికెట్’ జారీకోసం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పంట ఎగుమతుల కోసం ఇప్పటి వరకు 18,486 మంది రైతులు (కొత్తగా 17,416 మంది) నమోదు చేసుకున్నారు. ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమ తుల అభివృద్ధి అథారిటీ (ఎంపెడా) సౌజన్యంతో విజయవాడ, తిరుపతిల్లో బయ్యర్స్–సెల్లర్స్ మీట్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పండే బంగిన పల్లి, సువర్ణరేఖ, తోతాపూరి, చిన్న రసాలకు దేశీయంగానే కాదు.. విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. గడిచిన రెండేళ్లు ఆశించిన స్థాయిలో రేటు పలకలేదని, కనీసం ఈ ఏడాదైనా టన్ను రూ.లక్ష వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. లాక్‌డౌన్ పరిస్థితులున్నప్పటికీ ప్రభుత్వం చర్యల వల్ల గతేడాది గల్ఫ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేయగలిగారు.
యూరప్ దేశాల ఆంక్షలతో కలవరం
సాధారణంగా ఎగుమతుల్లో 30–40 శాతం యూరప్ దేశాలకు, 40–50 శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. కాగా ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్ దేశాలు విమాన రాకపోకలపై విధిస్తోన్న ఆంక్షలు మామిడి ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన నెలకొంది. పూత ఆలస్యం కావడంతో పూర్తిస్థాయిలో మామిడి మార్కెట్‌కు రావడం ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలవుతుందని, ఈలోగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆశాభావంతో ఎగుమతిదారులు, రైతులు ఉన్నారు. కాగా ఈ ఏడాది దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తి వేయడంతో ఆ దేశానికి ఎగుమతి చేసేందుకు ఎగుమతి దారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈసారి మంచి దిగుబడులు
గడిచిన రెండేళ్లు కరోనా వల్ల ఆశించిన స్థాయిల్లో ఎగుమతులు జరగక రైతులు ఇబ్బంది పడ్డారు. శాస్త్రవేత్తలు, ఉద్యానవనశాఖాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తుండడం వలన మంచి ఫలితాలొస్తున్నాయి. ఆర్బీకేలు వేదికగా నిర్వహిస్తోన్న తోటబడులు, ఫ్రూట్‌కేర్ యాక్టివిటీస్ వల్ల ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ మామిడి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది.
– ఎస్‌ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యానవన శాఖ
Comments
Please login to add a commentAdd a comment