పొగచూరిన పూత
Published Mon, Feb 17 2014 3:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: గతంలో ఎన్నడూ లేనివిధంగా మామిడి పూత విరగబూయడంతో రైతులు దిగుబడులపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వర్షంలా కురుస్తున్న మంచు వారి ఆశలపై నీళ్లు చల్లింది. పొగమంచు దెబ్బకు కళ్లెదుటే పూత మాడిపోతుండటంతో ఆందోళనకు గురవుతున్నరు. గత కొద్ది రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, పొగ మంచు మామిడితో పాటు జీడిమామిడి పంటలను నాశనం చేస్తోంది. చెట్ల నిండా కనబడిన పూత.. తీరా పిందె దశకు వచ్చే సరికి పొగమంచు మాడ్చేస్తుండటంతో దిగాలు చెందుతున్నారు.
పూతలో నాలుగోవంతు కూడా పిందెలుగా మారకపోవడం, పిందెలునిలువక పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి తోటలు లీజుకు తీసుకున్న వ్యాపారస్తులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 9242 హెక్టార్లల్లో మామిడి, 23,355 హెక్టార్లలో జీడి మామిడి తోటలు సాగవుతున్నాయి. మామిడి రణస్థలం మండలంలో 952 హెక్టార్లు, జి.సిగడాంలో 652 హెక్టార్లు, సారవకోటలో 601 హెక్టార్లు, రాజాంలో 560 హెక్టార్లు, ఆమదాలవలసలో 500 హెక్టార్లతోపాటు వీరఘట్టం, నందిగాం, సంతకవిటి, పొందూరు, లావేరు మండలాల్లోనూ ఎక్కువగా సాగవుతోంది.
అదే విధంగా జీడిమామిడి వజ్రపుకొత్తూరు మండలంలో 3759 హెక్టార్లు, సీతంపేటలో 3450 హెక్టార్లు, మందసలో 3193 హెక్టార్లు, పలాసలో 1564 హెక్టార్లు, రణస్థలంలో 1726 హెక్టార్లు, ఎచ్చెర్లలో 1417 హెక్టార్లలో సాగువుతోంది. ప్రారంభంలో మామిడి పూత చూసి ఖరీఫ్ నష్టాలు భర్తీ చేసుకోవచ్చని భావించారు. అయితే గత కొద్దిరోజులుగా దట్టంగా కురుస్తున్న మంచు, ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులు రైతుల ఆశలను మాడ్చేస్తున్నాయి. విరగబూసిన పువ్వు పిందెగా మారటానికి పొగమంచు వాతావరణం అడ్డంకిగా మారింది. ప్రధానంగా సువర్ణరేఖ రకం పొగమంచు ధాటికి బాగా దెబ్బతిన్నదని రైతులు చెబుతున్నారు. అధిక లాభాలు చేకూర్చే ఈ రకం మామిడి పిందెలు మంచు ప్రభావంతో రాలిపోతున్నాయి. ఈ పరిణామాలతో తోటలను కౌలుకు తీసుకున్న వారు బెంబేలెత్తుతున్నారు. ఇవే పరిస్థితులు మరి కొద్ది రోజులు కొనసాగితే కోలుకోలేమని వారంటున్నారు.
పొగమంచుతో ముప్పే....
పొగమంచు వల్ల మామిడి, జీడి మామిడి తోటలకు నష్టమేనని, ఈ ఏడాది కొంతమేర పంట నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పిందెలు రాలకుండా ఉండడానికి మామిడి తోటలకు నీరు అందివ్వాలని సూచిస్తున్నారు. ఈ వాతావరణంలో మామిడికి తేనే మంచు పురుగు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందని, ఈ పురుగులు పూత, ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల పూలు వాడి రాలిపోతాయి. పురు గులు విసర్జించే తేనె లాంటి జిగురు పదార్ధం ఆకుల మీదపడి మసి తెగులు వృద్ది చెందుతుంది. దీని నివారణకు మొగ్గ దశలో 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కార్బారిల్ లేదా నాలుగు మిల్లీలీటర్ల ఇమిడో క్లోప్రిడ్ కలిపి పిచికారీ చేయాలి. పూత విచ్చుకుని 50 శాతం పిందెగా మారిన దశలో లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్, ఒక గ్రాము కార్బాండిజం కలిపి పిచికారీ చేయాలి. పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు చెట్లు కాండం, కొమ్మలు, బెరడు నెర్రెలు, పూమొగ్గలు తడిచే విధంగా పిచికారీ చేయాలని సూచిస్తున్నారు.
Advertisement
Advertisement