పుడమి పుత్రునిపై ప్రకృతి పగబట్టింది. వర్షరుతువులోనూ... గ్రీష్మ ప్రభావం కనిపిస్తోంది. ముఖం చాటేసిన వరుణుడు కర్షకుని కంట కన్నీరు కురిపిస్తున్నాడు. గంపెడాశలతో... పెట్టుబడులు పెట్టిన అన్నదాత ఇప్పుడు ఆకాశంవేపు జాలిగా చూస్తున్నాడు. వేసిన నారుమళ్లు ఎండిపోతుంటే వాటిని రక్షించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. అద్దెకు మోటార్లు తెచ్చి నీటితో తడిపి
అష్టకష్టాలు పడుతున్నారు.
శ్రీకాకుళం రూరల్ : జిల్లా రైతాంగంతో వరుణుడు దోబూచులాడుతున్నాడు. అరకొర వర్షాల ఫలితంగా జిల్లాలో ఖరీఫ్ సగానికి పడిపోయింది. మరో నెల రోజుల్లో దాదాపుగా ఖరీఫ్ సీజన్ ముగియనున్నా సరైన వర్షం కురవకపోవడంతో వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 2.45లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు సుమారు 76,662 హెక్టార్ల విస్తీర్ణంలోనే వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. జిల్లాలో ఆరకొరగా కురుస్తున్న వర్షాలతో సాగు వెనుకబడింది.
జిల్లాలో ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, గోగు, చెరకు పంటలను రైతులు సాగు చేశారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,05,030 హెక్టార్లు కాగా గత ఏడాది 2,05,484 హెక్టార్లలో సాగయింది. ఈ ఏడాది ఇంతవరకు ఎద పద్దతిలో 53,055 హెక్టార్లు, నారు మళ్ళు 13,517 హెక్టార్లలో వేశారు. మొత్తం 66,572 హెక్టార్లలోనే సాగయింది. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 5930 హెక్టార్లు కాగా గత ఏడాది 9103 హెక్టార్లలో సాగయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా వర్షాలు కురవడంతో ఇప్పటికి కేవలం 6617 హెక్టార్లకే పరిమితమైంది. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 10,909 హెక్టార్లు కాగా కేవలం 3959 హెక్టార్లలోనే సాగయింది. పత్తి సాధారణ విస్తీర్ణం 7579 హెక్టార్లయితే గత ఏడాది 9563 హెక్టార్లలో సాగవగా ఈ ఏడాది 5433 హెక్టార్లలో సాగయింది. చెరకు సాధారణ సాగు విస్తీర్ణం 5867 హెక్టార్లు కాగా గత ఏడాది 6378 హెక్టార్లలో, ఈ ఏడాది కేవలం 5600 హెక్టార్లలో సాగయింది. ఇక మిగిలిన పంటలైన పెసర, కంది, రాగి, నువ్వు, గంటి, జొన్న, గోగు వంటి పంటల పరిస్థితి కూడా అలాగే ఉంది.
తగ్గిన వర్షపాతం
ఈ ఏడాది జూన్ నెలవరకు వరుణుడి జాడ కానరాలేదు. గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల తరువాత మే నేలాఖరు వరకు వర్షాలు కురవనేలేదు. జూన్ నెలలో మాత్రం సాధారణం కంటే 65.9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూలై నెలలో వర్షపాతం సాధారణం కంటే 51.7 శాతం తక్కువగా నమోదయింది. దీంతో వరినారుకే కాకుండా మెట్టు పంటలు కూడా అంతంత మాత్రంగానే సాగయ్యాయి.
ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం పూర్తవ్వాలంటే మరో 1.65లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ నివేదికలు తయారు చేసే పనిలో ఉంది.
గత ఏడాది 2,39,702 హెక్టార్లలో సాగయింది. ఈ ఏడాది పత్తి, మొక్క జొన్న, వేరుశనగ సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. దీనికి కారణం వర్షాభావ పరిస్థితులే. దీనికి తోడు ఈ ఏడాది ఇప్పటికీ పలు కాలువల ద్వారా శివారు భూములకు సాగు నీరందలేదు. సాగు నీటి కాలువల పనులు పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడమే దీనికి కారణం.
మదుపులు ఆదాయాలు అంచనా వేస్తున్న రైతులు:
మదుపులు పెరుగుతున్న నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను అధిగమించి ఆయిల్ ఇంజన్లు వంటి వాటి ద్వారా సాగు చేస్తే వచ్చే ఆదాయాన్ని రైతులు అంచనా వేస్తున్నారు. వర్షాధారంగానో, కాలువ ద్వారా వచ్చే నీటితో సాగు చేస్తేనే సుమారు 20 వేల రూపాయల వరకు మదుపు అవుతుంది. అదే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వరి సాగు చేస్తే గిట్టుబాటు అవదనే ఉద్దేశ్యంతో రైతులు వరి సాగుకు వెనుకంజ వేస్తున్నారు.
సాగు సగమే!
Published Sun, Aug 2 2015 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement