ఈ నెలకు ఇంతే..!
► ఆగస్టులో విస్తారంగా వర్షాలు
► జిల్లాను పూర్తిస్థాయిలో తాకని నైరుతి రుతుపవనాలు
► గాలిలో పెరిగిన తేమ శాతం
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆనందపడిన రైతాంగం గత కొద్దిరోజులుగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఆందోళన చెందుతున్నారు. రోజూ మేఘాలు వస్తున్నా.. చినుకు జాడ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. నైరుతి రుతు పవనాలు పూర్తిస్థాయిలో జిల్లాలో విస్తరించకపోవడంతోనే భారీ వర్షాలు కురవడం లేదనే అభిప్రాయం వాతావరణ శాఖ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.
నైరుతి రుతు పవనాలు ఉత్తరాది వైపు పయనించడంతో శ్రీకాకుళం జిల్లాలో సరైన వర్షాలు కురవడం లేదని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం భూవిజ్ఞానం సీనియర్ శాస్త్రవేత్త జె.జగన్నాథం అభిప్రాయపడ్డారు. ఈ నెలలో చెదురుమదురు వర్షాలే ఉంటాయని.. ఆగస్టు నెలలో మాత్రం విస్తారంగా వానలు కురుస్తాయని చెప్పారు.
ఆమదాలవలస రూరల్: వాన దేవుడు ముఖం చాటేశాడు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూలై నెలలో వర్షపాతం లోటు సగం కంటే ఎక్కువగా ఉంది. ఉత్తరాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా కోస్తాంధ్రాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థతి మరీ ఘోరంగా ఉంది. ఎక్కడ మేఘాలు ఉంటే ఆ ప్రాంతంలోనే వర్షం పడుతోంది తప్ప.. జిల్లా అంతటా వర్షాలు పడటం లేదు. దీనికి ప్రధాన కారణం నైరుతి రుతు పవనాలు ఉత్తరాది వైపు పయనించడమే కారణమని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం భూవిజ్ఞానం సీనియర్ శాస్త్రవేత్త జె.జగన్నాథం అభిప్రాయపడ్డారు. గత ఏడాది జూన్ నెలలో 160 మి.మీ వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది జూన్ నెలలో కేవలం 80 మి.మీ వర్షపాతం జిల్లాలో నమోదు అయిందని పేర్కొన్నారు. అలాగే జూలై నెలలో 230 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా ప్రస్తుతం 50 శాతం మాత్రమే నమోదైందని వివరించారు.
వాతావరణంలోనే మార్పులే కారణం
వర్షం ముఖం చాటేయడానికి వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణమని జగన్నాథం చెప్పారు. వాతావరణం కాలుష్యం కావడంతో దీని ప్రభావం వర్షాలపై పడుతోందన్నారు. నైరుతి రుతుపవనాల కదలిక బాగానే ఉన్నా.. అవి జిల్లాను తాకకుండా పోతున్నాయన్నారు. కేరళను తాకి శ్రీలంక, బంగ్లాదేశ్, హిమలయాల మీదుగా ఉత్తరాఖండ్ వైపు పయనిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. ఆయా ప్రాంతాల్లో అటవీ సంపద అధికంగా ఉండటంతో పవనాలు అటువైపు పయనించడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. జిల్లాలో అటవీ సంపద తక్కువగా ఉన్నందున రుతు పవనాలు రాకుండా పోతున్నాయని పేర్కొన్నారు.
చిరాకు కలిగిస్తున్న వాతావరణం
గత కొద్ది రోజులుగా ఉన్న వాతావరణం జనానికి చిరాకు తెప్పిస్తోంది. ఉష్టోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ అది తాత్కాలికమేనని వాతావరణ నిపుణులు అంటున్నారు. నైరుతి రుతు పవనాలు జిల్లాను పూర్తిస్ధాయిలో తాకే వరకు ఎండ తీవ్రత కూడా ఉంటుందంటున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందంటున్నారు. జిల్లాలో సగటు ఉష్టోగ్రత 36 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జూలై నెలలో భారీ వర్షాలు పడటానికి అవకాశం లేదనే చెప్పాలి. జిల్లాలో పూర్తిస్థాయిలో వర్షం కురవాలంటే ఆగస్టు 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
వాతావరణంలో పెరిగిన తేమ శాతం
వాతావరణంలో 20 రోజులుగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమ శాతం 65–70 మధ్య నమోదవుతుంది. ఉష్టోగ్రతలు కూడా 36 డిగ్రీలు దాటుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పూట కూడా గాలిలో తేమ శాతం 75–85 మధ్య ఉంటుంది. దీనివల్ల రాత్రి ఉష్టోగ్రతలు 26 డిగ్రీల పైనే నమోదువుతున్నాయి. దీంతో రాత్రి వేళ ప్రజలు ఉక్కపోతకు గురై నీరసించి కంటిమీద కునుకు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు.
పంటలపై తీవ్ర ప్రభావం
జూలై నెలలో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు కలవర పడుతున్నారు. పంటలపై ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మెట్ట భూముల్లో సాగు చేస్తున్న పంటలకు వర్షాలు లేని కారణంగా తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి పోటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటరు నీటిలో పిచికారి చేసుకోవాలని సూచిస్తున్నారు.
వాతావరణంలో మార్పులు
మరో నెల రోజుల్లో వాతావరణంలో మార్పులు వచ్చి రుతుపవనాలు పూర్తిస్థాయిలో జిల్లాను తాకుతాయి. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. జూలై నెలలో మాత్రం అంతగా వర్షాలు కురవడానికి అవకాశం లేదు. జిల్లాలో అటవీ శాతం తగ్గడం వలన ఇలాంటి మార్పులు వస్తున్నాయి. అందుకే గోగు పంట సాగు విస్తృతంగా చేపట్టాలి. ఈ సాగు వలన వర్షాలు కూడా సమయానికి కురిసే అవకాశం ఉంటుంది. ఎకరా గోగు పంట సాగు 10 ఎకరాల అటవీ సంపదతో సమానం. పచ్చదనాన్ని విపరీతంగా పెంచితేనే జిల్లా సస్యశ్యామలంగా ఉంటుంది. లేకుంటే వాతావరణంలో ఇలాంటి మార్పులు తప్పవు. – జె.జగన్నాథం, భూ విజ్ఞాన సీనియర్ శాస్త్రవేత్త, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనాస్థానం