జిల్లాలో అకాల వర్షం
► పాతపట్నం, మెళియాపుట్టి, మందసలో భారీ వాన
► లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీరు
► భారీ గాలులు..విరిగిన చెట్లు
మండువేసవిలో వరుణుడు కరుణించాడు. భగభగ మండే ఎండ నుంచి జనానికి ఉపశమనం కలిగించాడు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం అకాల వర్షం కురిసింది. మందస, సీతంపేట, కొత్తూరు, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట, పాతపట్నం, సీతంపేట, కంచిలి , టెక్కలి, నందిగాం, హిరమండలం తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన పడడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. మామిడి, జీడి, అపరాల పంటలకు ఈ వర్షం జీవం పోషిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మందస/ఎల్.ఎన్.పేట/సీతంపేట/పాతపట్నం/కొత్తూరు/ మెళియాపుట్టి/కంచిలి: అకాల వర్షంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకూ తీవ్రమైన ఎండతో జనం ఇబ్బందులు పడ్డారు. అయితే 12 గంటల తరువాతఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై, మెరుపులు, ఉరుములతో వర్షం పడింది. గాలులు కూడా వీచాయి. మందసలో భారీ వర్షం పడింది. ఈ వర్షం మామిడి, జీడితోటలకు ఉపయోగంగా ఉంటుందని రైతులు తెలిపారు. ఉమాగిరి గ్రామానికి చెందిన పొందర గొన్న కొబ్బరి చెట్లపై పిపుగు పడడంతో ఖాళీపోయాయి.
ఎల్.ఎన్.పేటలో చిరు జల్లులు
ఎల్.ఎన్.పేట మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. వాడవలస, మిరియాపల్లి, లక్ష్మీనర్సుపేట, ధనుకువాడ, బసవరాజుపేట తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. హిరమండలం మండలంలో కూడా చిరు జల్లులు పడ్డాయి.
పాతపట్నంలో కుండపోత..
పాతపట్నంతో పాటు పలు గ్రామాల్లో సాయంత్రం మూడు నుంచి గంట పాటు కుండపోత వర్షం కురిసింది. తెంబూరు, బడ్డుమర్రి, గంగువాడ, చిన్నలోగిడి, బొరుబద్ర, బైదలాపురం, శోభ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వర్షం నువ్వు పంటకు ఉపయోగంగా ఉంటుందని రైతులు తెలిపారు. కొత్తూరు మండలంలో చిరు జల్లులు పడ్డాయి. కొత్తూరు, పారాపురం, కర్లెమ్మ, మహసింగితో పాటు పలు గ్రామాల్లో పడిన జల్లులతో జనం ఆనందానికి లోనయ్యారు.
మెళియాపుట్టిలో ఈదురు గాలులు
మెళియాపుట్టి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో వర్షం పడింది. ఈ ప్రభావానికి పలుచోట్ల చెట్లు, చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. కొసమాల పాఠశాల సమీపంలోని మెయిన్‌రోడ్డులో మోడు బారిన చెట్టు ఈదురు గాలులకు నేలకొరిగింది. విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. అయితే ఆక్షణంలో రోడ్డుపై ఎవరూ ప్రయాణించక పొవడంతో పెద్దప్రమాదమే తప్పింది. సరిహద్దులో రాకపోకలు స్తంభించాయి. మెళియాపుట్టి, చాపర, కొసమాల, వసుం దర, పట్టుపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
కంచిలి మండలంలో:కంచిలిమండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో మధ్యాహ్నం 12 నుంచి సుమారు రెండు గంటల వరకు వర్షం కురిసింది.ఈ వర్షం అపరాలు, ఉద్యాన పంటలకు లబ్ధి చేక్చూుతోందరి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో కూడా కొద్దిగా వర్షం పడింది.