మామిడి రైతుకు ఏటా కష్టాలే అంటూ ఈనాడు తప్పుడు రాతలు
ఏటా పెరుగుతున్న మామిడి తోటల విస్తీర్ణం.. ఐదేళ్లలో కొత్తగా 55,865 ఎకరాల్లో సాగు
2.97 లక్షల టన్నుల మేర పెరిగిన దిగుబడులు
టీడీపీ హయాంలో టన్ను రూ.40–50 వేలకు మించని ధర
ప్రస్తుతం గరిష్టంగా టన్నుకు రూ.1.30 లక్షలు
రూ.1.80 కోట్ల రాయితీతో ఫ్రూట్ కవర్ల పంపిణీ
దేశంలో తొలిసారి మామిడి రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్
ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది. పాత తోటల పునరుద్ధరణ, కొత్త తోటల విస్తరణ కోసం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించింది. నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా తోట బడులు, ఆర్బీకేల ద్వారా రైతులకు శిక్షణ ఇప్పించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టపోయిన మామిడి రైతులకు పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) అందించింది.
బంగినపల్లి, ఇమామ్ పసంద్ వంటి ఫైన్ వెరైటీ పండ్లకు టీడీపీ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా టన్ను రూ.40వేలు–50వేలు పలుకగా, ఈ ప్రభుత్వంలో రూ.1.30లక్షల వరకు కూడా పలికింది. గత ప్రభుత్వంలో టన్ను రూ.ఐదారువేలు కూడా పలకని తోతాపూరికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రూ.10వేలకు తగ్గకుండా పలికేలా చేసింది. కానీ ఇవేమీ పట్టని ఈనాడు దినపత్రిక ప్రభుత్వంపై బురద జల్లడం, మామిడి రైతులను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ‘మామిడి రైతుకు ఏటా కష్టాలే’ అంటూ విషం కక్కింది.
ఆరోపణ: 5.86 లక్షల ఎకరాల్లో తగ్గిన విస్తీర్ణం!
వాస్తవం: 2019–20లో 9,41,235 ఎకరాల్లో మామిడి తోటలు సాగవగా, 2023–24లో అది 9,97,100 ఎకరాలకు పెరిగింది. కొత్తగా ఈ ఐదేళ్లలో 55,865 ఎకరాల్లో కొత్తగా మామిడి తోటలు పెరిగాయి. 2019–20లో 46.88లక్షల టన్నుల దిగుబడులు రాగా, 2023–24లో 49.85లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. వాస్తవం ఇలా ఉంటే ఈనాడుకు మాత్రం రాష్ట్రంలో 5.86 లక్షల ఎకరాల్లో మామిడి సాగు తగ్గిపోయింది,
ఆరోపణ: చీడపీడలను నివారించేందుకు చర్యలేవి?
వాస్తవం: 5 ఏళ్లలో 883 తోట బడుల ద్వారా సమీకృత తెగులు, ఎరువు యాజమాన్య పద్ధతులపై మామిడి రైతులకు ఆర్బీకే స్థాయిలో శిక్షణనిచ్చారు. శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందాలను మామిడి సాగయ్యే జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయిలో తోటలకు సోకుతున్న చీడపీడలు, తెగుళ్లను గుర్తించడం, తక్షణ నివారణ చర్యలు చేపట్టేలా రైతులను అప్రమత్తం చేస్తున్నారు. నల్లతామరతో సహా వివిధ రకాల చీడపీడలు, తెగుళ్ల నివారణకు రైతు క్షేత్రాల్లోనే సామూహిక చర్యలు చేపట్టారు.
వాట్సప్ గ్రూపుల ద్వారా చిన్న చిన్న వీడియో సందేశాలను పంపి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. రూ.కోటి రాయితీతో 2802.50 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మామిడి సాగుకు, రూ.3.50 కోట్ల రాయితీతో 6250 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల నాణ్యత ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపట్టారు. ఇలా 4 ఏళ్లలో రూ.1.80 కోట్ల రాయితీతో ఫ్రూట్ కవర్లను రైతులకు పంపిణీ చేశారు. తద్వారా మామిడి నాణ్యత ప్రమాణాలను పెంచి దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా ఆంధ్ర మామిడికి గిరాకీ వచ్చేటట్టు చేయగలిగారు.
ఆరోపణ: వైకాపా వచ్చాక ప్రోత్సాహమే కరువు
వాస్తవం: పండ్ల తోటల విస్తరణ, నిర్వహణ కార్యక్రమం కింద 1.14 లక్షల మంది రైతులకు రూ.126.51 కోట్లు, పాత తోటల పునరుద్ధరణ కింద 8618 మందికి రూ.14.53 కోట్ల లబ్ధి చేకూర్చారు. ప్రస్తుతం ఉన్న తోటలలో ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా సూక్ష్మనీటి సాగు పథకం కింద ఐదేళ్లలో 70,350 ఎకరాల్లో మామిడి తోటలకు డ్రిప్ పరికరాలను సమకూర్చారు.
5 ఏళ్లలో రూ.35.04 కోట్ల రాయితీతో 1752 ప్యాక్ హౌస్‌లను రైతుల పొలాల్లో నిర్మించగా, రూ.39.02 కోట్ల రాయితీతో 485 కలెక్షన్ కేంద్రాలను మామిడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా నిర్మించారు. 91 కోల్డ్ రూమ్స్ నిర్మాణానికి 70 శాతం రాయితీ అందించారు. 2023–24లో మామిడి రైతుల అభివృధ్ధి కోసం రూ.22.50 కోట్ల రాయితీతో మామిడి ఎఫ్‌పీఓల ద్వారా 200 కలెక్షన్ సెంటర్లు, రూ.10.50 కోట్ల రాయితీతో రైతు క్షేత్రాల్లో 525 ప్యాక్ హౌస్‌లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆరోపణ: ఎగుమతులకు ఏదీ ప్రోత్సాహం
వాస్తవం: ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రతిఏటా అపెడా ఆధ్వర్యంలో అమ్మకపు, కొనుగోలు దారుల సదస్సులు నిర్వహించారు. దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, అమెరికా, లండన్ వంటి దేశాలకు కూడా పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగాయి. టీడీపీ కాలంలో ఐదేళ్లలో ఏటా సగటున 500 టన్నులు ఎగుమతి అయితే.. ఈ 5 ఏళ్లలో ఏటా సగటున 1200 టన్నుల పండ్లతో పాటు 8 లక్షల టన్నుల మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేయగలిగారు. మరో వైపు దేశంలోనే తొలిసారి మామిడి రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ జారీ చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఫలితంగా మామిడి ఎగుమతులు పెరగడమే కాదు..రైతులు అత్యధిక ధర పొందేందుకు దోహదపడనుంది.
ఆరోపణ: మామిడి రైతులకు చేయూత ఏదీ
వాస్తవం: ప్రాంతాల వారీగా మామిడి తోటలను సమీప గుజ్జు పరిశ్రమలకు అనుసంధానం చేశారు. తోతాపురి మామిడి ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ధరలు పతనం కాకుండా చర్యలు చేపట్టారు. పండ్ల నాణ్యతను పెంచడానికి పండు ఈగల నష్టాన్ని నివారించడానికి ఆధునిక పండ్లకోత పరికరాలతో పాటు పండు ఈగ నివారణకు అవసరమైన ఆకర్షణ బుట్టలను పంపిణీ చేస్తున్నారు. పండ్ల కోత, నాణ్యతపై మండల స్థాయిలో రైతులకు, కోసిన పండ్లను గుజ్జు తయారీ పరిశ్రమలకు చేరవేయడంపై ఆర్బీకే సిబ్బందికి జిల్లా స్థాయిలోనూ శిక్షణ ఇచ్చారు.
ధరలు పడిపోకుండా ఉండేందుకు దశల వారీగా పండ్ల కోతలు జరిగేలా చర్యలు చేపట్టారు. కోత మొదలైనప్పటి నుంచి చివరి పండు కోత కొచ్చే వరకు ప్రతిరోజు ధరల స్థిరీకరణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ఫలితంగా ఈ ఐదేళ్లలో ఏ దశలోనూ టన్ను రూ.10వేలకు తగ్గకుండా ఉంది. సీజన్‌లో గరిష్టంగా రూ.23వేలకు అమ్ముకోగలిగారు. అదే టీడీపీ హయాంలో ఏనాడు రూ.5వేలకు మించి కొనలేని పరిస్థితి ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment