మామిడి రైతు నిలువు దోపిడీ | mango farmers problems | Sakshi
Sakshi News home page

మామిడి రైతు నిలువు దోపిడీ

Published Fri, May 9 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

మామిడి రైతు నిలువు దోపిడీ

మామిడి రైతు నిలువు దోపిడీ

సూర్యాపేట, న్యూస్‌లైన్ : సూర్యాపేటలోని జనగాం ఎక్స్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన మూడు ప్రైవేటు మార్కెట్‌యార్డులు ఉన్నాయి.  ఇక్కడినుంచి రోజూ 30లారీల మామిడికాయ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఈ యార్డులకు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి రైతులు మామిడికాయలు విక్రయించేందుకు వస్తున్నారు. రైతుల నుంచి లోకల్ కాయను టన్నుకు 16 వేల నుంచి 23 వేల వరకు, ఇతర ప్రాంతాల కాయలను టన్నుకు రూ.13 నుంచి రూ.15 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. వాటినే రూ.30 వేల నుంచి రూ. 40 వేల వరకు భోపాల్, ఇండోర్, కోల్‌కతా, నాగ్‌పూర్, ముంబై, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఒక్కో లారీకి 15టన్నుల చొప్పున ఎగుమతి అవుతుంది. సుమారు 450 టన్నుల మామిడికాయ ప్రతిరోజూ ఎగుమతి అవుతుంది. కానీ ఈ మార్కెట్ యార్డులకు ఎలాంటి అనుమతులూ లేవు. మార్కెట్‌కు చెల్లించాల్సిన సెస్‌ను కూడా చెల్లించడం లేదు. ఒక్క శాతం సెస్ రూపేణా చెల్లించినా ప్రతిరోజు రూ.45వేల ఆదాయం మార్కెటింగ్ శాఖకు వస్తుంది. కానీ వ్యాపారులు ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండానే మామిడికాయను ఖరీదు చేస్తుండడంతో మార్కెట్ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.
 
 ఎగుమతి ఇలా..
 మార్కెట్‌కు వచ్చిన పచ్చి మామిడికాయను గ్రేడింగ్ విధానంలో నాలుగు రకాలుగా విభజిస్తున్నారు. కాయసైజును బట్టి డబ్బాలను తయారుచేసి లోడింగ్ చేస్తున్నారు. వాటిలో కార్బైడ్‌ను పెట్టి సీజ్ చేయడంతో మూడు రోజుల్లో ఆకుపచ్చగా ఉన్న మామిడికాయలు పసుపురంగులోకి మారుతుంటాయి. వారు పంపించాల్సిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత నేరుగా డబ్బాలను ఇప్పితే రంగుమారి నిగనిగలాడుతుంది. వాటిని ఆయా ప్రాంతాల్లో టన్నుకు రూ.లక్ష వరకు విక్రయిస్తున్నారు.

 కార్బైడ్ ప్యాకింగ్..
 కార్బైడ్‌ను బహిరంగ ప్రదేశాల్లో ప్యాకింగ్ చేయడం వల్ల దానికి గాలిసోకి ఊపిరితిత్తుల వ్యాధి భారీన పడే ప్రమాదముందని డాక్టర్లు తెలుపుతున్నారు. మామిడికాయల ప్యాకింగ్ సమయానికి ముందే మహిళలు, పిల్లలతో కార్బైడ్ పొట్లాలను తయారుచేస్తున్నారు. ఆయా పొట్లాలను మామిడికాయ డబ్బాల్లో అమరుస్తున్నారు.
 
 నష్టాల బాటలో కౌలు రైతులు..
 లక్షలాది రూపాయలు వెచ్చించి తోటలను కౌలుకు తీసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  ఈ యేడు వాతావరణం అనుకూలించక 25 శాతం కూడా దిగుబడి రాలేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. డిసెంబర్ నెలలో పూత రావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత వచ్చి రాలిపోయిందని వాపోతున్నారు.  దీంతో ఇప్పటికీ 30 శాతం దిగుబడి మాత్రమే వచ్చిందని, మరోనెల రోజుల పాటు మరికొంత దిగుబడి వచ్చే అవకాశముందంటున్నారు.
 
 నియంత్రణ లేని చెక్‌పోస్టులు..
 సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్ద నియంత్రణ కొరవడింది. మార్కెటింగ్ శాఖ నుంచి అనుమతి పత్రం ఇవ్వకుండానే కొన్ని లారీలను తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల డ్యూటీ లో ఉండాల్సిన అధికారులు కూడా డుమ్మా కొట్టి ప్రైవేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. రోజూ 45 లారీల మామిడికాయ వెళ్తుంటే వ్యాపారుల వద్ద లారీకి రూ.300 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చెక్‌పోస్టులపై నియంత్రణ చేస్తే మార్కెట్ ఆదా యం పెరుగుతుంది.
 
 పాత మార్కెట్‌లో మామిడి కాయను ఖరీదు చేయాలి
 సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్‌లో మామిడికాయ ఖరీదు చేసేందుకు వసతులు కల్పించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు దూర ప్రాంతాల్లో ఇబ్బందులు పడకుండా పాత మార్కెట్‌లో ఉన్న షెడ్లలో కాయను పోసుకునేందుకు ఏర్పాటుచేసి వ్యాపారులను మార్కెట్‌లోకి పిలిపించాలని  రైతు సంఘం నాయకుడు మల్లు నాగార్జున్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement