గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మళ్లీ ఎలుకలు
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు మళ్లీ స్వైర విహారం చేశాయి. ఎముకల వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళ చేతి వేళ్లను ఎలుకలు కొరికాయి. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. గతనెలలో పసికందును ఎలుకలు తినేసిన సంఘటన మరిచి పోకముందే శుక్రవారం పాము కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ఈ రోజు ఎలుకలు మహిళ చేతి వేళ్లను తినేశాయి. దాంతో ఆమెను అత్యవసర చికిత్సా విభాగానికి తరలించారు. రోశమ్మ(40) అనే మహిళ జీజీహెచ్‌లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతోంది. శనివారం తెల్లవారుజామున ఆమెపై ఎలుకల గుంపు దాడి చేశాయి. అది గమనించిన రోగి తరపు వారు వైద్యులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వారు అత్యవసర చికిత్సా విభాగానికి తరలించి ఆమెకు వైద్యం చేశారు. ఈ సంఘటనతో వార్డులోని రోగులు బెంబేలెత్తుతున్నారు.
కాగా అధికారుల నిర్లక్ష్యంతో ఎలుకల దాడిలో పసికందు చనిపోయిన ఘటనతో కళ్లు తెరిచిన అధికారులు ఎలుకలు పట్టేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో సుమారు 400 ఎలుకలను పట్టుకున్నారు. అయినా ఎలుకలు వస్తుండటంతో పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు.