నిమ్మగడ్డతో కలిసి వృద్ధులు, దివ్యాంగుల ఉసురు పోసుకున్నాడు
‘సమాజ సేవలో వలంటీర్ల పాత్ర’ సదస్సులో మండిపడ్డ ప్రజా సంఘాలు
సాక్షి, అమరావతి: సాఫీగా సాగుతున్న పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు నాయుడు, అయన అనుకూల వర్గాలు అడ్డు తగిలి వృద్ధుల ఉసురు తీస్తున్నాయని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఏపీ ఇంటిలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ‘సమాజ సేవలో వలంటీర్ల పాత్ర’ పై రాష్ట్ర స్ధాయి సదస్సు గురువారం జరిగింది.
ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో వక్తలు తొలుత వలంటీర్లకు తమ సంఘీభావం తెలిపారు. పచ్చ బ్యాచ్ కుట్రల వల్ల మృతిచెందిన వృద్దులకు ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. ఈ వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ లాంటివారు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు.. లోకేశ్ అడుగుపెడితే అరిష్టం
ముఖ్య వక్తగా పాల్గొన్న ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ దివంగత ఎన్‌టీ రామారావు ప్రజల వద్దకు పాలన తేవాలని ప్రయత్నించగా దానిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్ధ ద్వారా ఇంటి వద్దకే తెచ్చారన్నారు. 1660 లోనే కేంబ్రిడ్జి వలంటీర్ పదాన్ని విల్ అనే పేరుతో డిక్షనరీలో చేర్చారని, అమెరికా ప్రెసిడెంట్ కూడా వలంటీర్‌గా సేవ చేస్తారని, మన దేశంలో ఇన్నేళ్లలో ఎవరికీ రాని ఆలోచన జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చిందన్నారు.
సొంత బిడ్డలు కూడా చేయని సేవను వృద్ధులు, దివ్యాంగులకు జగన్ చేస్తుంటే పచ్చముఠాకు కళ్ళు కుట్టి రాక్షసంగా వ్యవహరించి వృద్ధులు, వికలాంగుల ఉసురు పోసుకున్నారన్నారు. వంద దుర్యోధనులను కలిపితే ఒక చంద్రబాబు అని, ఎన్నికల తర్వాత అతన్ని అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. పచ్చ ముఠాకు చెందిన అష్ట్రగహ కూటమి అరాచకాలను ఎండగట్టడానికి రాష్ట్ర మంతటా వైఎస్సార్‌సీపీ తరపున ప్రచారం చేస్తానని పేర్కొన్నారు.
‘నిమ్మగడ్డ’ ఓ శకుని
ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శకుని లాగా వ్యవహరిస్తూ, పెన్షన్‌దారుల ఉసురు పోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు తాము అండగా ఉంటామని, వారి ప్రాధమిక హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు. వలంటీర్లు ముందు ఈ దేశ పౌరులని, వారు తమ వాదనను స్వేచ్ఛగా వినిపించవచ్చని, తమ మద్దతును బహిరంగంగా తెలుపవచ్చని స్పష్టం చేశారు.
ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్.కృష్ణంరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు సుమారు 3.66 కోట్ల పౌర సేవలందాయని తెలిపారు. బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నరహరిశెట్టి జ్యోతి మాట్లాడుతూ వలంటీర్లను ప్రజా సేవకు దూరం చేయాలనుకోవడం అవివేకమని, రానున్న రోజుల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సేవలు యధాతథంగా కొనసాగుతాయన్నారు.
వలంటరీ వ్యవస్ధకు అంతర్జాతీయ ప్రశంసలు
ప్రవాస భారతీయుడు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ వలంటరీ వ్యవస్ధ పలు అంతర్జాతీయ సంస్ధల నుంచి ప్రశంసలు పొందిందని, ఇటువంటి వ్యవస్థ మరే రాష్ట్రంలో లేదన్నారు. వలంటీర్లు, పెన్షనర్లపై చంద్రబాబు దురాగతాలు రాష్ట్రానికి హెచ్చరిక లాంటిదన్నారు. ఈ పెత్తందార్లు తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. రాజకీయ విశ్లేషకుడు ఎల్. శివరామప్రసాద్ మాట్లాడుతూ వలంటీర్లు సమర్ధవంతంగా పని చేస్తూ రూ. 85 వేల కోట్లు పంపిణీ చేశారన్నారు.
వేల కోట్ల రూపాయలు వారి చేతుల మీదుగా పంపిణీ చేసినప్పటికీ ఎక్కడా పైసా దుర్వినియోగం కాలేదన్నారు. మారుతీ మహిళా సొసైటీ గౌరవ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు మాట్లాడుతూ వలంటీర్లను ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్ రంగ నిపుణులు ఎస్.ధనలక్ష్మి, నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి తుళ్ళూరు సూరిబాబు, ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధి గోమతోటి వినోద్ పాల్, ఎమ్మార్పీఎస్ నేత మేడర సురేష్ తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment