పగటిపూట 9 గంటల కరెంటుకు రెడీ | Ready to power 9 hours a day | Sakshi
Sakshi News home page

పగటిపూట 9 గంటల కరెంటుకు రెడీ

Published Sun, Apr 10 2016 4:43 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

పగటిపూట 9 గంటల కరెంటుకు రెడీ - Sakshi

పగటిపూట 9 గంటల కరెంటుకు రెడీ

రైతులు వద్దంటేనే పగలు, రాత్రి సరఫరా చేస్తున్నాం..
♦ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ
♦ ఈఆర్‌సీ చార్జీల పెంపు ప్రతిపాదన
♦ మండిపడ్డ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి తాము అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్‌పీడీసీఎల్) సీఎండీ వెంకటనారాయణ చెప్పారు. అందుకోసం అవసరమైన మౌలిక అభివృద్ధి పనుల కోసం రూ.635.48 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ ఈఆర్‌సీ) ఎదుట ప్రతిపాదించారు.

రైతుల విజ్ఞప్తి మేరకే పగలు, రాత్రి వేళల్లో దశల వారీగా 9 గంటల కరెంటును సరఫరా చేస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో క్రాస్ సబ్సిడీ, అదనపు సర్‌చార్జీల పెంపు ప్రతిపాదనలపై టీఎస్ ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు ఎల్.మనోహర్‌రెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వెంకటనారాయణ మాట్లాడుతూ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యుత్ సరఫరా, పంపిణీ, వినియోగదారుల సేవలు, మౌలిక వసతుల అభివృద్ధిలో సాధించిన విజ యాలు, ఆదాయ వ్యయాలతోపాటు చార్జీల పెంపు అవసరాన్ని వివరించారు.

ఎన్‌పీడీ సీఎల్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో నికర లోటు రూ.4,236 కోట్లుగా పేర్కొన్న సీఎండీ... రిటైల్ సప్లయ్, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జిలు, అదనపు సర్‌చార్జిల ప్రతిపాదిత ధరల ద్వారా రూ.385 కోట్లు సమకూర్చుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 36.62 లక్షల గృహ వినియోగదారులుండగా, అందులో 30.03 లక్షల(82 శాతం) గృహ వినియోగదారులు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వారేనని పేర్కొన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదిత ధరలవల్ల ఆయా వర్గాలపై ఎలాంటి భారం ఉండబోదని చెప్పారు.

 9 గంటల విద్యుత్ వాడకుండా కుట్ర
 దీనిపై పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి రాత్రిపూట కరెంటు సరఫరా చేయాలని రాష్ర్టంలో రైతులెవరూ కోరుకోవడంలేదని అన్నారు. వ్యవసాయ బోర్లకు ఆటోస్టార్టర్లు పెడితే కేసులుపెట్టి ప్రాసిక్యూట్ చేయాలని విద్యుత్ అధికారులు పేర్కొనడం వెనుక కుట్ర దాగి ఉందని విమర్శించారు. ‘రాత్రిపూట రైతులు పొలాల్లోకి వెళితే చీకట్లో విష సర్పాల బారిన పడే ప్రమాదముందని ఆటో స్టార్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్లా చేస్తే కేసులు పెడతామంటే రైతులెవరూ రాత్రిపూట కరెంటు వాడుకునే పరిస్థితి ఉండదు. అసలే సాధారణ సాగుతో పోలిస్తే ఖరీఫ్‌లో 50 శాతం మాత్రమే పంట సాగైంది. ఇక రబీలోనైతే 70 శాతం సాగు చేయలేదు. అసలే కరెంటు వినియోగం తక్కువ. అందులోనూ అధికారులు ఇలాంటి నిబంధనలతో 9 గంటల కరెంటును వాడుకోకుండా కుట్ర చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement