TS ERC
-
తప్పిన ‘ట్రూ అప్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. రూ.12,718.4 కోట్ల ట్రూఅప్ చార్జీల భారం తప్పింది. ఇదే సమయంలో సాధారణ విద్యుత్ చార్జీల పెంపు కూడా ఉండబోదని స్పష్టమైంది. ట్రూఅప్ చార్జీల మొత్తంతోపాటు రూ.9,124.82 కోట్ల సబ్సిడీ సొమ్మును రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనితో వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే 2023–24 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు ఉండదని, ప్రస్తుత చార్జీలు (టారిఫ్) యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) శుక్రవారం ప్రకటించింది. ఐదేళ్లలో చెల్లిస్తామనడంతో.. 2023–24లో ప్రస్తుత విద్యుత్ రిటైల్ సప్లై టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలని.. గత కొన్నేళ్లకు సంబంధించి వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ డిస్కంలు ఇంతకుముందే ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. ఇలా వసూలు చేయాల్సిన చార్జీల మొత్తాన్ని రూ.12, 718.4 కోట్లుగా ఈఆర్సీ తే ల్చింది. ఈ మొత్తాన్ని విద్యుత్ వినియోగదారుల నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని వచ్చే ఐదేళ్లలో వడ్డీతో కలిపి చెల్లించడానికి ముందుకు వచ్చింది. దీనితో విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మేరకు టీఎస్ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణ య్య శుక్రవారం తమ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రార్థనా స్థలాలకు చార్జీల తగ్గింపు డిస్కంల విజ్ఞప్తి మేరకు ఈఆర్సీ ప్రార్థన స్థలాలకు విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.5కి తగ్గించింది. ప్రస్తుతం ఎల్టీ –7(బీ) కేటగిరీలో 2 కిలోవాట్లలోపు లోడ్ కలిగిన ప్రార్థన స్థలాలకు యూనిట్‌కు రూ.6.4.. ఆపై లోడ్ కలిగిన ప్రార్థన స్థలాలకు యూనిట్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని ప్రార్థన స్థలాలకు యూనిట్ రూ.5కి తగ్గనుంది. హెచ్‌టీ–2 (బీ) కేటగి రీలోని ప్రార్థన స్థలాలకు అదనంగా రూ. 260 ఫిక్స్డ్ చార్జీలను వసూలు చేస్తారు. సంప్రదింపులతో తప్పిన భారం! ఏదైనా నిర్దిష్ట కాలానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీ కోసం ఈఆర్సీ ఆమోదించిన అంచనా వ్యయం కంటే.. జరిగిన వాస్తవ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేస్తారు. 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,015 కోట్ల విద్యుత్ కొనుగోలు ట్రూ అప్ వ్యయం, 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూ షన్ ట్రూఅప్ వ్యయం కలిపి.. మొత్తం రూ. 16,107 కోట్లను ట్రూఅప్ చార్జీలుగా వసూ లు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ఇటీవల ఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. ఈ లెక్కలపై పరిశీలన జరిపిన ఈఆర్సీ రూ.12,718.4 కోట్ల ట్రూఅప్ చార్జీలకు ఆమోదం తెలపగా.. ఈ మేరకు బిల్లుల్లో వసూలుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు కోరాయి. కానీ ఈఆర్సీ ఈ స్థాయిలో భారం వేస్తే వినియోగదారులు ఇబ్బందిపడతారంటూ సీఎం కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. దీంతో ఈ భారాన్ని భరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించడంతో వినియోగదారులకు ఉపశమనం లభించింది. -
పగటిపూట 9 గంటల కరెంటుకు రెడీ
రైతులు వద్దంటేనే పగలు, రాత్రి సరఫరా చేస్తున్నాం.. ♦ ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ ♦ ఈఆర్సీ చార్జీల పెంపు ప్రతిపాదన ♦ మండిపడ్డ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి తాము అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్) సీఎండీ వెంకటనారాయణ చెప్పారు. అందుకోసం అవసరమైన మౌలిక అభివృద్ధి పనుల కోసం రూ.635.48 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ ఈఆర్సీ) ఎదుట ప్రతిపాదించారు. రైతుల విజ్ఞప్తి మేరకే పగలు, రాత్రి వేళల్లో దశల వారీగా 9 గంటల కరెంటును సరఫరా చేస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో క్రాస్ సబ్సిడీ, అదనపు సర్‌చార్జీల పెంపు ప్రతిపాదనలపై టీఎస్ ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు ఎల్.మనోహర్‌రెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వెంకటనారాయణ మాట్లాడుతూ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యుత్ సరఫరా, పంపిణీ, వినియోగదారుల సేవలు, మౌలిక వసతుల అభివృద్ధిలో సాధించిన విజ యాలు, ఆదాయ వ్యయాలతోపాటు చార్జీల పెంపు అవసరాన్ని వివరించారు. ఎన్పీడీ సీఎల్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో నికర లోటు రూ.4,236 కోట్లుగా పేర్కొన్న సీఎండీ... రిటైల్ సప్లయ్, క్రాస్ సబ్సిడీ సర్చార్జిలు, అదనపు సర్‌చార్జిల ప్రతిపాదిత ధరల ద్వారా రూ.385 కోట్లు సమకూర్చుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 36.62 లక్షల గృహ వినియోగదారులుండగా, అందులో 30.03 లక్షల(82 శాతం) గృహ వినియోగదారులు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వారేనని పేర్కొన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదిత ధరలవల్ల ఆయా వర్గాలపై ఎలాంటి భారం ఉండబోదని చెప్పారు. 9 గంటల విద్యుత్ వాడకుండా కుట్ర దీనిపై పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి రాత్రిపూట కరెంటు సరఫరా చేయాలని రాష్ర్టంలో రైతులెవరూ కోరుకోవడంలేదని అన్నారు. వ్యవసాయ బోర్లకు ఆటోస్టార్టర్లు పెడితే కేసులుపెట్టి ప్రాసిక్యూట్ చేయాలని విద్యుత్ అధికారులు పేర్కొనడం వెనుక కుట్ర దాగి ఉందని విమర్శించారు. ‘రాత్రిపూట రైతులు పొలాల్లోకి వెళితే చీకట్లో విష సర్పాల బారిన పడే ప్రమాదముందని ఆటో స్టార్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్లా చేస్తే కేసులు పెడతామంటే రైతులెవరూ రాత్రిపూట కరెంటు వాడుకునే పరిస్థితి ఉండదు. అసలే సాధారణ సాగుతో పోలిస్తే ఖరీఫ్‌లో 50 శాతం మాత్రమే పంట సాగైంది. ఇక రబీలోనైతే 70 శాతం సాగు చేయలేదు. అసలే కరెంటు వినియోగం తక్కువ. అందులోనూ అధికారులు ఇలాంటి నిబంధనలతో 9 గంటల కరెంటును వాడుకోకుండా కుట్ర చేస్తున్నారు’ అని మండిపడ్డారు.