తప్పిన ‘ట్రూ అప్‌’ షాక్‌! | ERC Announces Annual Retail Tariff Order 2023 and 2024 | Sakshi
Sakshi News home page

తప్పిన ‘ట్రూ అప్‌’ షాక్‌!

Published Sat, Mar 25 2023 2:19 AM | Last Updated on Sat, Mar 25 2023 7:39 AM

ERC Announces Annual Retail Tariff Order 2023 and 2024 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. రూ.12,718.4 కోట్ల ట్రూఅప్‌ చార్జీల భారం తప్పింది. ఇదే సమయంలో సాధారణ విద్యుత్‌ చార్జీల పెంపు కూడా ఉండబోదని స్పష్టమైంది.

ట్రూఅప్‌ చార్జీల మొత్తంతోపాటు రూ.9,124.82 కోట్ల సబ్సిడీ సొమ్మును రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనితో వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే 2023–24 ఆర్థిక ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్‌ చార్జీల పెంపు ఉండదని, ప్రస్తుత చార్జీలు (టారిఫ్‌) యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ ఈఆర్సీ) శుక్రవారం ప్రకటించింది. 

ఐదేళ్లలో చెల్లిస్తామనడంతో.. 
2023–24లో ప్రస్తుత విద్యుత్‌ రిటైల్‌ సప్లై టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలని.. గత కొన్నేళ్లకు సంబంధించి వినియోగదారుల నుంచి ట్రూఅప్‌ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ డిస్కంలు ఇంతకుముందే ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. ఇలా వసూలు చేయాల్సిన చార్జీల మొత్తాన్ని రూ.12, 718.4 కోట్లుగా ఈఆర్సీ తే ల్చింది. ఈ మొత్తాన్ని విద్యుత్‌ వినియోగదారుల నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని వచ్చే ఐదేళ్లలో వడ్డీతో కలిపి చెల్లించడానికి ముందుకు వచ్చింది. దీనితో విద్యుత్‌ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మేరకు టీఎస్‌ఈఆర్సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌ రాజు, బండారు కృష్ణ య్య శుక్రవారం తమ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. 

ప్రార్థనా స్థలాలకు చార్జీల తగ్గింపు 
డిస్కంల విజ్ఞప్తి మేరకు ఈఆర్సీ ప్రార్థన స్థలాలకు విద్యుత్‌ చార్జీలను యూనిట్‌కు రూ.5కి తగ్గించింది. ప్రస్తుతం ఎల్టీ   –7(బీ) కేటగిరీలో 2 కిలోవాట్లలోపు లోడ్‌ కలిగిన ప్రార్థన స్థలాలకు యూనిట్‌కు రూ.6.4.. ఆపై లోడ్‌ కలిగిన ప్రార్థన స్థలాలకు యూనిట్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని ప్రార్థన స్థలాలకు యూనిట్‌ రూ.5కి తగ్గనుంది. హెచ్‌టీ–2 (బీ) కేటగి రీలోని ప్రార్థన స్థలాలకు అదనంగా రూ. 260 ఫిక్స్‌డ్‌ చార్జీలను వసూలు చేస్తారు. 

సంప్రదింపులతో తప్పిన భారం! 
ఏదైనా నిర్దిష్ట కాలానికి సంబంధించి విద్యుత్‌ కొనుగోళ్లు, పంపిణీ కోసం ఈఆర్సీ ఆమోదించిన అంచనా వ్యయం కంటే.. జరిగిన వాస్తవ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు.. ఈ వ్యత్యాసాన్ని ట్రూఅప్‌ చార్జీల రూపంలో వసూలు చేస్తారు.

2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,015 కోట్ల విద్యుత్‌ కొనుగోలు ట్రూ అప్‌ వ్యయం, 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూ షన్‌ ట్రూఅప్‌ వ్యయం కలిపి.. మొత్తం రూ. 16,107 కోట్లను ట్రూఅప్‌ చార్జీలుగా వసూ లు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ఇటీవల ఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి.

ఈ లెక్కలపై పరిశీలన జరిపిన ఈఆర్సీ రూ.12,718.4 కోట్ల ట్రూఅప్‌ చార్జీలకు ఆమోదం తెలపగా.. ఈ మేరకు బిల్లుల్లో వసూలుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు కోరాయి. కానీ ఈఆర్సీ ఈ స్థాయిలో భారం వేస్తే వినియోగదారులు ఇబ్బందిపడతారంటూ సీఎం కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. దీంతో ఈ భారాన్ని భరించేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించడంతో వినియోగదారులకు ఉపశమనం లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement