సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించడానికి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇచ్చిన గడువు జనవరి 2తో ముగియనుంది. విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) అంచనాలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడువు పెంచాలని డిస్కంలు విజ్ఞప్తి చేయగా.. ఈఆర్సీ జనవరి 2 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించేందుకు కొత్త ప్రభుత్వం నుంచి డిస్కంలు ఇంకా అనుమతి పొందలేదు. దీంతో జనవరి 30వరకు మరోసారి గడువు పొడిగించాలని ఈఆర్సీని కోరేందుకు డిస్కంల యాజమాన్యాలు సిద్ధమైనట్టు తెలిసింది.
టారిఫ్ ప్రతిపాదనల్లో ఏం ఉంటాయంటే..?
2024–25లో రాష్ట్రంలో మొత్తం ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది? అందుకు ఎన్ని రూ.వేల కోట్ల ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2024–25లో కొనసాగిస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ నిధులు ఎంత, ఇంకా ఎంత లోటు ఉంటుంది? ఆ లోటును పూడ్చుకోవడానికి 2024–25లో ఏయే కేటగిరీల వినియోగదారుల చార్జీలను ఎంతమేర పెంచాలన్న అంశాలు డిస్కంల ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా అభ్యంతరాలను సేకరించి, బహిరంగ విచారణ నిర్వహించి.. కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేయాల్సి ఉంటుంది.
రూ.30వేల కోట్లకు చేరిన ఆర్థిక లోటు
2022–23 నాటికి రాష్ట్రంలో డిస్కంల నష్టాలు రూ.62,461 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సగటున ప్రతి నెలా రూ. 1,386 కోట్లు లెక్కన మరో రూ.11,088 కోట్ల నష్టాలు వచ్చినట్టు ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో డిస్కంల నష్టాలు రూ. 73,549 కోట్లకు చేరుకున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సిడీనే కొనసాగిస్తే.. 2024–25లో డిస్కంలకు కొత్తగా మరో రూ.16,632 కోట్ల నష్టాలు వస్తాయని అంచనా. నష్టాలను అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.31,632 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉండనుంది. లేకుంటే లోటును భర్తీ చేసుకోవడానికి విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తుంది.
కొత్త సర్కారు ముందు సవాళ్లు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థల నిర్వహణ సవాలుగా మారింది. విద్యుత్ సబ్సిడీలను ఏటా రూ.30వేల కోట్లకు పెంచడం లేదా ఏ ఏడాదికా ఏడాది లోటు భర్తీ చేసుకోవడానికి చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికితోడు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదే విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతిస్తే విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన ఉంది. దీంతో టారిఫ్ ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఉచితంగా 200 యూనిట్లపైప్రతిపాదనలు సిద్ధం
కాంగ్రెస్ సర్కారు హామీ మేరకు ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసే అంశాన్ని 2024–25 టారిఫ్ ప్రతిపాదనల్లో చేర్చడంపై డిస్కంలు కసరత్తు పూర్తిచేశాయి. 200యూనిట్లలోపు వినియోగించే వినియోగదారులు ఎందరు? వారికి ఉచిత విద్యుత్ కో సం అయ్యే వ్యయం ఎంత? అన్న గణాంకాలతో ప్రతి పాదనలు సిద్ధం చేశాయి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. ఈ పథకాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈఆర్సీ అనుమతిని కోరనున్నాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే.. ప్రభుత్వం అదనంగా రూ.3,500 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment