ఆంధ్రప్రదేశ్‌: విద్యుత్‌ చార్జీలు పెంచం  | Electricity Charges Will Not Be Burdened Next Year, Says Power Distribution Companies - Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌: విద్యుత్‌ చార్జీలు పెంచం 

Published Sat, Dec 2 2023 4:56 AM | Last Updated on Sat, Dec 2 2023 12:25 PM

Electricity charges will not be burdened next year - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) భారీ ఊరటనిచ్చాయి. వచ్చే ఏడాది ఏ వర్గం వినియోగదారులపైనా విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ప్రకటించాయి. రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ చార్జీల భారం వేయబోమని స్పష్టం చేశాయి. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యుత్‌ ప్రసార (ఏపీ ట్రాన్స్‌కో), పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2024–25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌), 2024–2029 నియంత్రణ కాలా­నికి సంబంధించి నెట్‌వర్క్‌ ఆదాయ అవసరాల నివేదికలను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)­కి సమర్పించాయి.

ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ఇంధన శాఖ శుక్రవారం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తక్కువ ధరలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు కట్టుబడి ఉన్నా­యని తెలిపింది. దానికి తగ్గట్టుగానే ఏఆర్‌ఆర్‌లలో ఎలాంటి విద్యుత్‌ చార్జీల పెంపుదలను ప్రతిపాదించలేదని వివరించింది. 

లోటు ఉన్నప్పటికీ భారం మోపబోం.. 
2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 74,522.67 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమని డిస్కంలు అంచనా వేశాయి. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు 12,321.58 మిలియన్‌ యూనిట్లు అవసరమని నివేదించాయి. మొత్తం మీద 83,118.13 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టాయి.

విద్యుత్‌ ప్రసార నష్టాలు 2.6 శాతం, ఇంటర్‌ స్టేట్‌ నష్టాలు 0.9 శాతం, పంపిణీ నష్టాలు 6.84 శాతం, మొత్తం ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డి్రస్టిబ్యూషన్‌ నష్టాలు 10.34 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశాయి. ఈ లెక్కన విద్యుత్‌ కొనుగోలు ఖర్చు రూ.39,017.60 కోట్లు అవుతుందని భావిస్తున్నాయి. అది కాకుండా ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ లోడ్‌ డిస్పాచ్‌ ఖర్చు రూ.5,722.88 కోట్లు, డి్రస్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ధర రూ.9,514.42 కోట్లు, ఇతర ఖర్చులు రూ.2,321.13 కోట్లుగా పంపిణీ సంస్థలు నిర్ణయించాయి.

దీని ప్రకారం మొత్తంగా రూ.56,576.03 కోట్ల రాబడి అవసరమని నివేదించాయి. అయితే అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ.42,697.92 కోట్లు మాత్రమే వస్తున్నాయని.. దీంతో రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని వివరించాయి. అయినప్పటికీ ఈ లోటు­ను భర్తీ చేసుకోవడం కోసం ప్రజలపై చార్జీల భారం మోపాలనుకోవడం లేదని ఏపీఈఆర్‌సీకి డిస్కంలు నివేదించాయి.

యధావిధిగా ఉచిత, రాయితీలు 
రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డిస్కంలకు తిరిగి చెల్లిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా డిస్కంలు దాదాపు రూ.11,800 కోట్ల రెవెన్యూ లోటుతో వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో డిస్కంలను ఆదుకోవడానికి రూ.10,135.22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

అలాగే ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సరఫరా, తక్కువ స్లాబ్‌ గృహవినియోగదారులకు సబ్సిడీ, ఆక్వాకల్చర్‌ రైతులు, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులు, పవర్‌ లూమ్స్, హ్యాండ్‌లూమ్స్, సెలూన్లు, గోల్డ్‌ ప్లేటింగ్, రజక సంఘాలు మొదలైన వాటికి రాయితీలు వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నాయి. దీంతో డిస్కంలు వినియోగదా­రుల టారిఫ్‌లలో ఎలాంటి మార్పును ప్రతిపాదించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement