సాక్షి,సిటీబ్యూరో: ఎల్బీస్టేడియంలో శనివారం జరగనున్న సమైక్యాంధ్ర సభ అధర్మసభ అని తెలంగాణ జేఏసీ కోచైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ అభివర్ణించారు. తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు శనివారం బంద్‌కు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంద్ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, కార్మికులెవరూ విధులకు హాజరుకాకుండా బంద్ విజయవంతం చేయాలని కోరారు. సమైక్యాంధ్ర సభను అనుమతించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్ పాటిస్తున్నామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల్లో బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. సమావేశానికి తెలంగాణ మునిసిపల్ జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య అధ్యక్షత వహించారు.
ఒక్క బస్సు కూడా కదలదు : అశ్వథ్థామరెడ్డి
అఫ్జల్‌గంజ్ : టీజేఏసీ పిలుపు మేరకు తెలంగాణ బంద్‌కు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శుక్రవారం యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అశ్వథ్థామరెడ్డి ఎంజీబీఎస్‌లో యూనియన్ నాయకులు, కార్మికులతో సమావేశమై బంద్‌ను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణజిల్లాల్లో ఆర్టీసీకి చెందిన 59వేలమంది ఉద్యోగులు, కార్మికులు బంద్‌లో పాల్గొంటారన్నారు. బంద్‌కు ఆర్టీసీ ఎన్‌ఎంయూ తెలంగాణ విభాగం మద్దతు ప్రకటించింది.
న్యాయవాదుల విధుల బహిష్కరణ: సమైక్య సభకు అనుమతివ్వడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు శుక్రవారం జంటనగరాల పరిధిలోని అన్నికోర్టుల విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఛలో హైకోర్టు కార్యక్రమంలో భాగంగా భారీగా హైకోర్టుకు తరలివెళ్లారు.
సమైక్య సభకు వెళ్తే తరిమికొడ్తాం..
ఏజీ వర్సిటీ : ఏపీఎన్జీవోల సమైక్యసభకు ఏజీవర్సిటీ సీమాంధ్ర ఉద్యోగులు హాజరైతే వారిని వర్సిటీ నుంచి తరిమికొడ్తామని తెలంగాణ అగ్రికల్చర్ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. సమైక్యసభకు ప్రభుత్వం అనుమతివ్వడాన్ని నిరసిస్తూ వర్సిటీలోని హార్టికల్చర్,అగ్రికల్చర్, విద్యార్థి,ఉద్యోగ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం ప్రతిఉద్యోగి నల్లబ్యాడ్జి ధరించి నిరసన తెలపాలని తెలంగాణ వెటర్నరీ బోధనేతర సిబ్బంది చైర్మన్ జయరాంరెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాకుండా సీఎం కుట్ర
బషీర్‌బాగ్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీఎం కిరణ్ విశ్వప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్ దుయ్యబట్టారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీమాంధ్రులు క్యాన్సర్‌లా వ్యాపించారు
పంజగుట్ట: సీమాంధ్రులు క్యాన్సర్‌లా హైదరాబాద్‌లో వ్యాపించారని తెలంగాణ ఎకానమీ ఫ్రంట్ కన్వీనర్ విద్యకుమార్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో క్రైస్తవ సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఎస్తేరురాణి, తెలుగుజనం పరిషత్ ప్రతినిధి జగన్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.
సకలం బందే..
Published Sat, Sep 7 2013 2:22 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement