వద్దంటున్నా.. ఆగడం లేదు!
ప్రశాంతంగా ఉన్న తమ ప్రాంతంలో థర్మల్‌ప్లాంటును ఏర్పాటు చేసి జీవితాలను నాశనం చేయవద్దని వేడుకుంటున్న ప్రజల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. తమదే పైచేయి కావాలన్నట్టు వ్యవహరిస్తూ ముందుకు పోతోంది. జపాన్‌కు చెందిన సుమితోమా సంస్థ ఆర్థిక సహకారంతో పోలాకి మండలంలో నిర్మించతలపెట్టిన 400 మెగావాట్ల ఆల్ట్రామెగా థర్మల్‌ప్లాంటు ఏర్పాటును ఈ ప్రాంతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు విధాలుగా నిరసన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు.
ప్లాంటు ప్రతిపాదిత ప్రాంతాల్లో శుక్రవారం భూ సర్వేకు పూనుకున్నారు. దీన్ని రైతులు, ప్రజాసంఘాలు అడ్డుకోవడంతో పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. భారీ బందోబస్తు మధ్య సర్వేను కొనసాగించారు. అరెస్టు చేసిన వారిని వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు.
* ఉద్యమంపై ఉక్కుపాదం
* భారీ పోలీసు బందోబసు నడుమ ‘థర్మల్’ సర్వే
* అడ్డుకున్న ప్రజాసంఘాల నాయకులు అరెస్టు, విడుదల
* ఆటంకం కలిగిస్తే ఎంతమందినైనా అరెస్టు చేస్తామన్న పోలీసులు
తోటాడ(పోలాకి): ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా థర్మల్‌ప్లాంట్ నిర్మాణానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. పోలీసుల సాయంతో ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు వెనుకాడడం లేదు. పోలాకి ప్రాంతంలో 38 వేల కోట్ల రూపాయలతో నిర్మించాలని భావిస్తున్న మెగాఆల్ట్రా థర్మల్ ప్లాంట్ కోసం భూసర్వేకు ఇటీవల అధికారులు పూనుకోవడంతో ప్రజలు అడ్డుకున్నారు.
అయితే అప్పటికి వెనక్కి తగ్గిన అధికారులు శుక్రవారం మరోసారి సర్వేకు వచ్చారు. ఈసారి భారీగా పోలీసులను వెంటతీసుకొచ్చారు. అరుుతే థర్మల్ వ్యతిరేకులు కూడా వెనక్కి తగ్గలేదు. తోటాడ వద్ద జెన్‌కో, రెవెన్యూ అధికారులు చేపడుతున్న సర్వేను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పోలాకి, నరసన్నపేట, జలుమూరు స్టేషన్ల నుంచి సిబ్బందిని రప్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై ఎన్.లక్ష్మణ్ మాట్లాడుతూ సర్వేను అడ్డుకోవద్దని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు వినలేదు. సర్వే బృందాలను వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
దీంతో ఈటీసీ యంత్రాలను పట్టుకుని సిబ్బంది వెనక్కి వచ్చేశారు. అదే సమయంలో నరసన్నపేట సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జలుమూరు ఎస్‌ఐతోపాటు మరికొంతమంది సిబ్బంది అక్కడకు చేరుకుని సర్వే అడ్డుకోవద్దని, ప్రజలు సహకరించాలని కోరారు. దీంతో అక్కడే ఉన్న ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటివరకూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన అధికారులు సర్వే నిలుపుదల చేస్తామని ప్రకటించి ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. వారితోపాటు ప్రజలు కూడా సర్వే తీరుపై తీవ్రంగా విరుసుకుపడ్డారు. దీంతో పోలీసులు ముందుగా ప్రజాసంఘాల నాయకులు కె.మోహనరావు, సురేష్‌బాబు, వారికి మద్దతిచ్చిన రైతు పైశాగి అప్పలస్వామిలను అరెస్టు చేసి..
పోలీసు వాహనంలో ఎక్కించి నరసన్నపేట స్టేషన్‌కు తరలించారు. వారి అరెస్టులను అడ్డుకున్న స్థానికులను కూడా పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టేశారు. ఎంతమందినైనా అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మరికొన్ని వాహనాలను తెప్పించారు. దీంతో ప్రజలు భయంతో వెనక్కి తగ్గారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య సర్వేను కొనసాగించారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
కేవలం దౌర్జన్యంగా, అధికార బలంతో.. అడ్డగోలుగా చేస్తున్న సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అరుుతే పోలీసు బందోబస్తు మధ్య కొనసాగించటం దారుణమైన చర్య. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. గతంలో కూడా పోలాకి థర్మల్‌పవర్‌ప్లాంట్ విషయంలో అనేక అరెస్టులను చూశాం. ఇలాంటి వాటికి భయపడేదిలేదు. సర్వేను అడుగడుగునా అడ్డుకుని తీరుతాం.
- కె.మోహనరావు, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
నిరసన వ్యక్తం చేసే పద్ధతి ఇదికాదు
ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై అనుమానాలు, వ్యతిరేకత ఉంటే వేరే పద్ధతుల్లో నిరసన చేపట్టండి. అంతేగాని సర్వేచేస్తు న్న అధికారులును అడ్డుకుంటే సహిం చం. కొంతమంది కావాలనే స్థానికులను రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని నమ్మోద్దు. నేరుగా ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా ప్రజాభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
- ఆర్.ఎస్.ఎస్.చంద్రశేఖరరావు, సీఐ, నరసన్నపేట