ఆందోళనలతో దద్ధరిల్లిన ఉద్యాన నగరి
- అత్యాచార ఘటనలపై ప్రజాసంఘాలు ఆందోళన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : స్థానిక ఫ్రేజర్ టౌన్‌లో పీజీ విద్యార్థినిపై, మారతహళ్లిలోని విబ్‌గ్యార్ స్కూలులో చిన్నారిపై జరిగిన అత్యాచారాలకు నిరసనగా నగరం గురువారం ఆందోళనలతో హోరెత్తింది. వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు లైంగిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఇక్కడి రేస్ కోర్సు రోడ్డులోని హోం మంత్రి కేజే. జార్జ్ నివాసాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు.
అత్యాచారాలకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు. బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు పులకేశి న గర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
పీజీ విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించిన కేసు తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ రఫిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైసూరు బ్యాంకు సర్కిల్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఫ్రేజర్ టౌన్ సంఘనటకు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు నినాదాలు చేశారు.
సినీ నటి మాళవిక, ఎమ్మెల్సీలు విమలా గౌడ, తార, ఎమ్మెల్యే శశికళ జొల్లె ప్రభృతులు ఆందోళనలో పాల్గొన్నారు. జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందరావు సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. లైంగిక దాడులకు పాల్పడిన వారిని గుర్తించడంలో విఫలమైనందుకు హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.