KJ. George
-
ప్రభుత్వ వైఫల్యాలు నిరసిస్తూ బీజేపీ ఆందోళన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పేదలకు ఉద్దేశించిన వివిధ గృహ నిర్మాణ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ మంగళవారం నగరంలో చేపట్టిన విధాన సౌధ చలో కార్యక్రమాన్ని పోలీసు భగ్నం చేశారు. ఫ్రీడం పార్కులో ర్యాలీ ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన బీజేపీ నాయకులు పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం మంత్రి కేజే. జార్జ్‌లు రాజీనామా చేసేంత వరకు పోరాటాన్ని సాగిస్తామని ప్రకటించారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పేదల పాలిట కంటకంగా తయారైందని ఆరోపించారు. పేదల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వారినే విస్మరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని విమర్శించారు. ఆయనను అధికారం నుంచి దించేంత వరకు ఆందోళనను విరమించేది లేదని ప్రకటించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి అసమర్థుడుగా తయారయ్యారని, శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్ప మాట్లాడుతూ మహిళలపై నిరంతరం అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం మౌనం వహిస్తోందని విమర్శించారు. దళితులు, మైనారిటీల సమస్యలపై స్పందించడం లేదని ఆరోపించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప, బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ మంత్రులు గోవింద కారజోళ, ఆర్. అశోక్ ప్రభృతులు ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా వచ్చిన నాయకులు, కార్యకర్తలను జేడీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అందరినీ బీఎంటీసీ బస్సుల్లో తరలించారు. -
గస్తీ మస్త్
అత్యాచారాల నిరోధానికి హోం శాఖకు మార్గదర్శకాలు రాత్రి వేళ ప్రత్యేక పోలీసుల నిఘా బాధితురాలి పేరు, వివరాలను గోప్యంగా ఉంచాలి దీన్ని పాటించని అధికారులపై క్రిమినల్ కేసు ఇన్‌టైంలో షాపులు, బార్లు మూసేయాలి పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాలను అరికట్టడానికి రూపొందించిన మార్గదర్శకాలను హోం మంత్రి కేజే. జార్జ్ శనివారం హోం శాఖకు పంపారు. అత్యాచారాల నిరోధానికి జిల్లా, తాలూకా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, అన్ని వార్డులు, లేఔట్లలో రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, అదనపు గస్తీ వాహనాలను ఏర్పాటు చేయాలని, వాటిల్లో ప్రత్యేక పోలీసు వ్యవస్థలు ఉండాలని...లాంటి సూచనలతో కూడిన మార్గదర్శకాలను డీజీపీ లాల్‌రుఖుమ్ పచావ్, అదనపు డీజీపీ ఎంఎన్. రెడ్డి, నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్లతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించారు. అత్యాచారాలను అరికట్టే క్రమంలో సీనియర్ అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని, అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు అందిన వెంటనే గంటలోగా బాధితురాలి ఇంటికి పోలీసులు చేరుకోవాలని, బాధితురాలిని విచారించే సమయంలో మహిళా పోలీసులు ఉండాలని మార్గదర్శకాల్లో నిర్దేశించారు. అంతేకాకుండా బాధితురాళ్లకు మనోధైర్యం కలిగించడానికి ఎస్పీల నాయకత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలాంటి సందర్భాల్లో ఎస్పీలు, కలెక్టర్ల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలను గోప్యంగా ఉంచాలని, ఇలాంటి కేసులను స్వయంగా ఎస్పీలు, డీసీపీలే విచారించాలని నిర్దేశించారు. గోప్యాన్ని పాటించని అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్ణీత సమయానికి వాణిజ్య సముదాయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేసేలా చూడాలని, అత్యాచారం కేసులను పరిశీలించడానికి డీసీపీల నేతృత్వంలో ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పాఠశాలలు, కళాశాల్లో సీసీ కెమెరాలు దేశ వ్యాప్తంగా లైంగిక దాడుల సంఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో రాష్ర్టంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే తెలిపారు. చిత్రదుర్గలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలల్లో కూడా విద్యార్థినుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా యాజమాన్యాలను హెచ్చరించామని చెప్పారు. మహిళా కళాశాలల్లో నిఘాను పెంచాలని పోలీసు అధికారులకు సూచించామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని ఎమ్మెల్యే శకుంతల శెట్టి నేతృత్వంలోని సంయుక్త సభా సలహా సంఘం చేసిన సూచనలను అందరితో చర్చించి అమలు చేస్తామని వెల్లడించారు. -
అత్యాచార కేసుల్లో...
సత్వర శిక్షలకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి దోషులకు సత్వరం శిక్షలు పడడానికి త్వరలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. రాష్ర్టంలో శాంతి భద్రతల పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయం కృష్ణాలో జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నేరాలను సమర్థంగా అరికట్టడానికి నగర పోలీసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లకు అధునాతన వాహనాలను సమకూర్చనున్నట్లు తెలిపారు. ఆ వాహనాలకు బహుళ కాంతివంతమైన లైట్లను కూడా అమర్చనున్నట్లు చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి కొత్త సహాయక కేంద్రాలను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎన్జీఓల సహకారంతో వీటిని నిర్వహిస్తామన్నారు. శాంతి భద్రతలపై ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి అన్ని రకాల చర్యలను చేపడతామని వెల్లడించారు. సీనియర్ పోలీసు అధికారులు శాంతి భద్రతలపై ఎక్కువ నిఘా వహించేలా చర్యలు చేపడతామని చెప్పారు. పోలీసు స్టేషన్లకు అందే అన్ని ఫిర్యాదులకు విధిగా ఎఫ్ఐఆర్లను నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిన పరిస్థితుల్లో ఆయా అదనపు డీజీపీలను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నగరంలో పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి సంబంధించి తాము ఎవరినీ రక్షించడం లేదని స్పష్టం చేశారు. కాగా సమావేశం అనంతరం నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ విడిగా మాట్లాడుతూ వరుస అత్యాచార సంఘటనలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. పీజీ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి కేసు నమోదు చేయడంలో సీఐ తప్పుందని అంగీకరించారు. కాగా నగరంలోని విబ్‌గ్యార్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశంలో పాల్గొన్నారు. -
ఆందోళనలతో దద్ధరిల్లిన ఉద్యాన నగరి
అత్యాచార ఘటనలపై ప్రజాసంఘాలు ఆందోళన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : స్థానిక ఫ్రేజర్ టౌన్లో పీజీ విద్యార్థినిపై, మారతహళ్లిలోని విబ్‌గ్యార్ స్కూలులో చిన్నారిపై జరిగిన అత్యాచారాలకు నిరసనగా నగరం గురువారం ఆందోళనలతో హోరెత్తింది. వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు లైంగిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఇక్కడి రేస్ కోర్సు రోడ్డులోని హోం మంత్రి కేజే. జార్జ్ నివాసాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. అత్యాచారాలకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు. బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు పులకేశి న గర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పీజీ విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించిన కేసు తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించిన ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైసూరు బ్యాంకు సర్కిల్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఫ్రేజర్ టౌన్ సంఘనటకు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. సినీ నటి మాళవిక, ఎమ్మెల్సీలు విమలా గౌడ, తార, ఎమ్మెల్యే శశికళ జొల్లె ప్రభృతులు ఆందోళనలో పాల్గొన్నారు. జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందరావు సర్కిల్లో ధర్నా నిర్వహించారు. లైంగిక దాడులకు పాల్పడిన వారిని గుర్తించడంలో విఫలమైనందుకు హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
గార్డులు లేని ఏటీఎంలను మూసేయిస్తాం
= మూడు రోజులు గడువు = బెంగళూరులో 600 కేంద్రాల వద్ద ‘నో సెక్యూరిటీ’ = వాటి వద్ద సర్కార్ భద్రత కల్పించలేదు = ఆ బాధ్యత ఆయా బ్యాంకులదే = ఏ క్షణంలోనైనా ఆగంతుకున్ని పట్టుకుంటాం : హోం మంత్రి వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలను మూయించి వేస్తామని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ హెచ్చరించారు. మూడు రోజుల్లోగా అన్ని కేంద్రాల వద్ద గార్డులను నియమించాలని బ్యాంకులకు సూచించారు. ఇక్కడి కార్పొరేషన్ సర్కిల్లోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలో అదే బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఓ ఆగంతకుడు మంగళవారం ఉదయం వేట కత్తితో దాడి చేసిన నేపథ్యంలో బుధవారం జార్జ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో రెండు వేల ఏటీఎంలుంటే 600 కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరని తెలిపారు. అన్ని ఏటీఎంలకు భద్రత కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు కనుక ఆయా బ్యాంకులే బాధ్యత వహించాలని అన్నారు. ఏటీఎంలకు సరైన భద్రత కల్పించే విషయమై సూచనలు చేయడానికి హోం శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఏటీఎంల వద్ద భద్రత ఉందో, లేదో పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఆగంతుకున్ని పట్టుకుంటాం ఏటీఎం కేంద్రంలో జ్యోతిపై దాడి చేసిన ఆగంతకుని ఆచూకీ తెలిసిందని, ఏ క్షణంలోనైనా అతనిని పట్టుకుంటామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. ఇప్పటికే అతని కోసం గాలించడానికి తన నాయకత్వంలో ఎనిమిది బృందాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు జరుగుతోందన్నారు. సీసీ టీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా ఆగంతకుని ఆనవాళ్ల గురించి పోలీసులకు కొన్ని క్లూలు లభించాయన్నారు. అతను కన్నడంలో మాట్లాడినందున ఎప్పటి నుంచో రాష్ట్రంలో ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. కోలుకుంటున్న జ్యోతి దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతికి మంగళవారం రాత్రి మేజర్ న్యూరోసర్జికల్ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ఇక్కడి కెంగేరిలోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మెదడులోకి చొచ్చుకు పోయిన పుర్రె ఎముకను తొలగించామని పేర్కొంది. దెబ్బ తిన్న మెదడు పొరలను సరి చేసినట్లు వెల్లడించింది. విరిగిన పుర్రె ఎముకలను కూడా తిరిగి అతికించినట్లు తెలిపింది. ప్లాస్టిక్ సర్జికల్ బృందం ముక్కు, ముఖంపై ఏర్పడిన గాయాలకు చికిత్సలు చేసిందని వివరించింది. పేషెంట్ సృ్పహలో ఉందని, మాట్లాడుతోందని తెలిపింది. ప్రస్తుతం ఆమె న్యూరో ఇంటెన్సిన్ కేర్ యూనిట్లో ఉన్నారని, అనుక్షణం ఆమెను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. రక్తం ఎక్కించామని, ప్రస్తుతం మెడికల్ మేనేజ్మెంట్లో ఉందని పేర్కొంది. చీఫ్ న్యూరో సర్జన్, ఆస్పత్రి ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్కే. వెంకట రమణ ఈ ప్రకటనను విడుదల చేశారు. కాగా హోం మంత్రితో పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, నగర పోలీసు కమినర్ ఆస్పత్రిలో ఆమెను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆమెకు ఏదైనా సాయం అందించగలమేమో...పరిశీలిస్తామని జార్జ్ తెలిపారు.