గస్తీ మస్త్
- అత్యాచారాల నిరోధానికి హోం శాఖకు మార్గదర్శకాలు
- రాత్రి వేళ ప్రత్యేక పోలీసుల నిఘా
- బాధితురాలి పేరు, వివరాలను గోప్యంగా ఉంచాలి
- దీన్ని పాటించని అధికారులపై క్రిమినల్ కేసు
- ఇన్‌టైంలో షాపులు, బార్లు మూసేయాలి
- పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాలను అరికట్టడానికి రూపొందించిన మార్గదర్శకాలను హోం మంత్రి కేజే. జార్జ్ శనివారం హోం శాఖకు పంపారు. అత్యాచారాల నిరోధానికి జిల్లా, తాలూకా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, అన్ని వార్డులు, లేఔట్లలో రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని, అదనపు గస్తీ వాహనాలను ఏర్పాటు చేయాలని, వాటిల్లో ప్రత్యేక పోలీసు వ్యవస్థలు ఉండాలని...లాంటి సూచనలతో కూడిన మార్గదర్శకాలను డీజీపీ లాల్‌రుఖుమ్ పచావ్, అదనపు డీజీపీ ఎంఎన్. రెడ్డి, నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌లతో పాటు అన్ని జిల్లాల ఎస్‌పీలకు పంపించారు.
అత్యాచారాలను అరికట్టే క్రమంలో సీనియర్ అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని, అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు అందిన వెంటనే గంటలోగా బాధితురాలి ఇంటికి పోలీసులు చేరుకోవాలని, బాధితురాలిని విచారించే సమయంలో మహిళా పోలీసులు ఉండాలని మార్గదర్శకాల్లో నిర్దేశించారు. అంతేకాకుండా బాధితురాళ్లకు మనోధైర్యం కలిగించడానికి ఎస్‌పీల నాయకత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలాంటి సందర్భాల్లో ఎస్‌పీలు, కలెక్టర్ల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు.
అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలను గోప్యంగా ఉంచాలని, ఇలాంటి కేసులను స్వయంగా ఎస్‌పీలు, డీసీపీలే విచారించాలని నిర్దేశించారు. గోప్యాన్ని పాటించని అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్ణీత సమయానికి వాణిజ్య సముదాయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేసేలా చూడాలని, అత్యాచారం కేసులను పరిశీలించడానికి డీసీపీల నేతృత్వంలో ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.
పాఠశాలలు, కళాశాల్లో సీసీ కెమెరాలు
దేశ వ్యాప్తంగా లైంగిక దాడుల సంఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో రాష్ర్టంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే తెలిపారు. చిత్రదుర్గలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలల్లో కూడా విద్యార్థినుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా యాజమాన్యాలను హెచ్చరించామని చెప్పారు. మహిళా కళాశాలల్లో నిఘాను పెంచాలని పోలీసు అధికారులకు సూచించామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని ఎమ్మెల్యే శకుంతల శెట్టి నేతృత్వంలోని సంయుక్త సభా సలహా సంఘం చేసిన సూచనలను అందరితో చర్చించి అమలు చేస్తామని వెల్లడించారు.